అడ్డగోలు తవ్వకాలు.. అడ్డుకున్న గ్రామస్తులు..

అడ్డగోలు తవ్వకాలు.. అడ్డుకున్న గ్రామస్తులు..

చెన్నారావుపేట, ఆంధ్రప్రభ : సామాన్యుడు తమ ఇంటి అవసరాల కోసం మొరం ట్రాక్టర్ల తరలిస్తే.. అడ్డుకునే అధికారులు ఏకంగా ఓ వ్యక్తి తనకున్న పలుకుబడితో టిప్పర్ల సహాయంతో యదేచ్చగా మట్టి తరలిస్తున్నా చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నర్సంపేటకి చెందిన ఓ వ్యాపారి హిటాచి సహాయంతో శనివారం రాత్రి నుండి చెన్నారావుపేట మండల కేంద్రంలోని కోపాకుల చెరువులో మట్టి తీస్తూ టిప్పర్లలో తరలిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు అర్ధరాత్రి టిప్పర్లను అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. కాగా స్టేషన్ కి తీసుకెళ్లాల్సిన అధికారులు టిప్పర్ ను వదిలేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఇదేంటని గ్రామస్తులు ప్రశ్నిస్తే నాకు ఇరిగేషన్ అధికారుల నుండి మట్టి తరలింపుకు అనుమతి ఉందని ఓ పత్రం చూపించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.

అసలు మా గ్రామానికి సంబందించిన వివిధ పనుల కోసం వాడుకోవాల్సిన మట్టిని వేరే ప్రాంతానికి చెందిన వ్యక్తికీ అనుమతి ఇవ్వడం ఏంటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. అనుమతుల పేరుతో అడ్డగోలుగా తవ్వకాలు చేపట్టి ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్న వ్యక్తుల పై చర్యలు తీసుకోవాల్సిన ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహారిస్తున్నారని ప్రజలు అంటున్నారు. ఆదివారం తెల్లవారుజాము వరకు టిప్పర్లు వెళ్తున్న దృశ్యాలు కనిపించాయని గ్రామస్తులు అంటున్నారు. ప్రజలు సమాచారం అందించినా పోలీసులు స్పందించిన తీరు సరిగ్గా లేదని అందరికీ ఇందులో పాత్ర ఉందని అనిపిస్తుందని ప్రజలు అంటున్నారు. ఏది ఏమైనా మట్టి దందాకు అడ్డుకట్టాల్సిన బాధ్యత ప్రతి అధికారి పై ఉందని ప్రజలు గుర్తు చేస్తున్నారు. కాగా ఈ విషయమై వివరణ కోసం ఇరిగేషన్, తహసీల్దార్, ఎస్. ఐ.కి ప్రయత్నించగా ఎవరు స్పందించలేదన్నారు.

Leave a Reply