దేశం గర్వించదగ్గ మేధావి అంబేద్కర్

దేశం గర్వించదగ్గ మేధావి అంబేద్కర్
- జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపునిచ్చారు. మంగళవారం అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని నిర్మల్ పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు పంచశీల జెండాను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అంబేద్కర్ ప్రపంచం గర్వించదగ్గ గొప్ప మేధావి అని కొనియాడారు.
బడుగు, బలహీన వర్గాలు వివక్షకు గురవుతున్న కాలంలో, సమసమాజ స్థాపనే లక్ష్యంగా ఆయన అహర్నిశలు శ్రమించారని గుర్తుచేశారు. అనంతరం జయంతి వేడుకల్లో భాగంగా ప్రత్యేకంగా ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా కలెక్టర్ అధికారులతో కలిసి రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఎస్సీ సంక్షేమ శాఖాధికారి దయానంద్, సీపీఓ జీవరత్నం, డీఈవో భోజన్న, వివిధ సంఘాల నాయకులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
