వరి కొయ్యలను కాల్చి పర్యావరణాన్ని పాడు చేయొద్దు

వరి కొయ్యలను కాల్చి పర్యావరణాన్ని పాడు చేయొద్దు
- జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట, ఆంధ్రప్రభ : రైతులు వరి పంట కోసిన తర్వాత పొలం పై ఉన్న వరి కొయ్యలను కాల్చడం వల్ల అనేక దుష్పరిణామాలు సంభవిస్తాయని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ రైతులకు సూచించారు. శనివారం సూర్యాపేట మండలం కాసారాబాద్ గ్రామంలో వరి కొయ్యలను తగలబెట్టొద్దని రైతులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె.నరసింహతో కలిసి పాల్గొని మాట్లాడారు. వరికోయ్యలు తగలబెడితే భూమి సారవంతం కోల్పోతుందని, అనంతరం దుక్కి దున్నినప్పటికీ గుల్లగా మారదని, దీనివల్ల పంట దిగుబడి తగ్గుతుందన్నారు.
సాంద్రత పెంచుకునేందుకు అధిక ఎరువులు వాడాల్సి వస్తుందని ఆ భారం కూడా రైతుల పైన పడుతుందని వివరించారు. వరి కొయ్యలను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యంతో పాటు, రహదారులపై వెళ్లే వాహనదారులకు కూడా ఇబ్బందులు ఏర్పడతాయని, వరి కొయ్యల వల్ల పక్కన ఉన్న చెట్లు, ఇతర విలువైన వస్తువులు పరికరాలు తగలబడే అవకాశం ఉందని, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని రైతులు ఎట్టి పరిస్థితులలో వరి కోయ్యలను తగలబెట్ట వద్దన్నారు. రైతులు వరికొయ్యలను తగలబెట్టకుండా ఉండేందుకుగాను వ్యవసాయ శాఖ ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.
జిల్లా ఎస్పీ కె.నరసింహ మాట్లాడుతూ వరి కొయ్యలను పొలం పైన తగలబెట్టడం వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతినడమే కాకుండా, భూములు సారవంతం కోల్పోతుందన్నారు. ఎవరైనా ఇలా వరి కొయ్యలు తగలబెట్టడం వల్ల ప్రమాదాల సంభవిస్తే అందుకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, ఎసిపి ప్రసన్న కుమార్, తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపిడిఓ బాలకృష్ణ, ఎడిఎ జ్ఞానేశ్వరి, ఎఓ కృష్ణ సందీప్, సర్పంచ్ కోతి గోపాల్ రెడ్డి ఇతర అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
