బీఆర్ఎస్ హయాంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం..

బీఆర్ఎస్ హయాంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం..

హసన్ పర్తి, ఆంధ్రప్రభ : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం కావడంతో పాటు అవినీతితో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి వేశారని హసన్ పర్తి మండల కాంగ్రెస్ అధ్యక్షులు పోరెడ్డి మహేందర్ రెడ్డి విమర్శించారు. హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి తో పాటు ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తంగళ్ళపల్లి తిరుపతి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరమే నోటిఫికేషన్లు వేయడంతో పాటు కాలంలో పరీక్షలు నిర్వహించి 70 వేల మందికి ఉద్యోగాలు కల్పించడంతో ఆనందోత్సవాలు వెల్లవిరిసాయని పేర్కొన్నారు. కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు ప్రతి కుటుంబానికి ఏ రాష్ట్రంలో లేని విధంగా సన్నబియ్యాన్ని పంపిణీ చేయడం ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు.

ఇందిరమ్మ ఇండ్లు, సబ్సిడీ పై గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్, రుణాలు మాఫీతో పాటు సన్నవడ్లకు బోనస్ అందజేయడంతో అన్ని వర్గాల ప్రజల మన్ననలను ప్రభుత్వం పొందడం శుభపరిణామమని తెలిపారు. 2014లో మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్ చేతిలో పెడితే ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చకుండా సొంత ఆస్తులు పెంచుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ద్వజమెత్తారు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారని తెలిపారు. రాబోయో కార్పొరేట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో పాటు వచ్చే 2029 ఎన్నికల్లో కూడా కాంగ్రెసే పక్కా అధికారంలోకి వస్తుంధని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు చల్లా రాకేష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు కనపర్తి కిరణ్,మండల మహిళా ఉపాధ్యక్షురాలు బత్తుల స్వాతి. నాగారం సర్పంచ్ లావణ్య సంతోష్. సీతానగరం సర్పంచ్ సునీత రమేష్ యాదవ్, పుల్ల రవీందర్, ఆరెల్లి వెంకటస్వామి, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ బిగుళ్ళ సురేష్, పెద్దమ్మ నరసింహ రాములు, వీసం సురేందర్ రెడ్డి, డైరెక్టర్లు గరిగే రాజు పెద్దమ్మ జితేందర్, అశోక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.