నైన్‌పాక లో పోలీసుల ‘కార్డన్ సెర్చ్’

  • చిట్యాల సిఐ ,డి ,మల్లేష్ ఆధ్వర్యంలో తనిఖీలు..

చిట్యాల, ఆంధ్రప్రభ: మండలంలోని నైన్‌పాక గ్రామంలో శనివారం చిట్యాల సీఐ దగ్గు మల్లేష్ ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మరంగా కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటిని, అనుమానాస్పద ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా గ్రామానికి చెందిన గుర్రం రాజేశ్వరి వద్ద ఐదు లీటర్ల నాటు గుడుంబా లభ్యమవడంతో ఆమెపై కేసు నమోదు చేసినట్లు చిట్యాల ఎస్‌ఐ పోచంపల్లి సతీష్ తెలిపారు. అలాగే సరైన పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటిపై జరిమానాలు విధించారు.

ఈ సందర్భంగా సీఐ దగ్గు మల్లేష్ మాట్లాడుతూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే డయల్-100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. తెలంగాణ పోలీసులు అమలు చేస్తున్న కొత్త విధానంలో బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే, సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఫిర్యాదు స్వీకరించి అక్కడికక్కడే ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తున్నారని తెలిపారు.

గ్రామాల్లో యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రజలంతా పోలీసులకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నైన్‌పాక గ్రామ సర్పంచ్ నక్క భాస్కర్, చిట్యాల ఎస్‌ఐ-2 రాజన్ కుమార్, ఎస్‌ఐ-3 ఈశ్వరయ్య, 24 మంది పోలీసు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.