రాజకీయ జోక్యంతో సింగరేణికి కష్టాలు
రాజకీయ జోక్యంతో సింగరేణికి కష్టాలు
మెడికల్ బోర్డు పాత పద్ధతిలో కొనసాగించాలీ
ఏఐటియుసి అధ్యక్షుడు సీతారామయ్య
గోదావరిఖనికి చేరుకున్న సేవ్ సింగరేణి జాత
గోదావరిఖని , ఆంధ్రప్రభ : మునుపెన్నడూ లేని విధంగా సింగరేణి బొగ్గు పరిశ్రమలో రాజకీయ జోక్యం పెరిగిపోయిందని, దీని మూలంగానే సంస్థ కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) గుర్తింపు సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య స్పష్టం చేశారు. సింగరేణి కార్మికుల హక్కుల సాధన సంస్థ పరిరక్షణ నినాదంతో చేపట్టిన సేవ్ సింగరేణి జాత ఆదివారం రాత్రి గోదావరిఖనికి చేరుకునేది.
ఈ సందర్భంగా ప్రధాన చౌరస్తా వద్ద ఏర్పాటుచేసిన సభలో గుర్తింపు సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ముఖ్య అతిథిగా హాజరై కార్మికుల నిర్దేశించి సుదీర్ఘంగా మాట్లాడారు. సంస్థలో ఏ చిన్న సమస్య అయినా… ఎలాంటి పనులు కావాలన్నా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంకు సంబంధించిన ప్రతినిధులు, ప్రజాప్రతినిధుల జోక్యంతోనే పనులు జరుగుతున్నాయని అలాంటి పరిస్థితి ప్రస్తుతం సింగరేణిలో తలెత్తడం విచారకరమన్నారు. 30వ తేదీ నాడు చేపట్టిన చలో కొత్తగూడెం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
వేలకోట్ల రూపాయల లాభాలను గడించిన సింగరేణి సంస్థ ప్రస్తుతం జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటున్నామని సంస్థ ఉన్నత అధికారులు చెప్పడం ఆస్యస్పదమని, ఇది ఎంతవరకు నిజమని… ఎవరి వల్ల ఈ సమస్య తలెత్తిందని సీతారామయ్య సూటిగా ప్రశ్నించారు. సింగరేణి సంస్థకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బకాయిన్న 51 వేల కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలన్నారు. మెడికల్ బోర్డు నిర్వహణ చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి మాటిచ్చారని అయినా నిర్వహణ చేపట్టడం లేదని మండిపడ్డారు.
మెడికల్ బోర్డు నిర్వహణలో జాప్యం మూలంగా సింగరేణి బొగ్గు పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు అనేక ఇబ్బందులకు రావాల్సి వస్తుందని… పాత పద్ధతి లోనే మెడికల్ బోర్డు నిర్వహణ కొనసాగాలని సీతారామయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా సింగరేణి బొగ్గు పరిశ్రమలు మారుపేరుల కార్మికుల సమస్య పరిష్కారం కావడంలేదని సీతారామయ్య ఆరోపించారు.
సింగరేణి బొగ్గు పరిశ్రమను ఎలాగైనా కాపాడుకొని తీరుతామని…. కార్మికుల హక్కుల సాధనకు ఏఐటియుసి ఎప్పుడు కూడా ముందుంటుందని ఇందులో ఎలాంటి సందేహం లేదని సీతారామయ్య నొక్కి చెప్పారు. ఈ సభలో ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ మడ్డి ఎల్లయ్య గౌడ్, నాయకులు వైవి రావు, కే స్వామి తో పాటు వివిధ డివిజన్లకు చెందిన ఏఐటియుసి ప్రతినిధులు వందలాదిమంది కార్మికులు పాల్గొన్నారు.
