రైతులను ఆదుకోవాలని సీఎంకి విజ్ఞప్తి

రైతులను ఆదుకోవాలని సీఎంకి విజ్ఞప్తి

అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతుల పరిస్థితి సీఎం కు తెలిపాను
నష్టపోయిన పంటల వివరాలను నమోదు చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు
మాజీ ఎమ్మెల్సీ తొండపు దశరథ జనార్ధన్

జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : అకాల వర్షాలతో పంట నష్టం జరిగిన రైతుల పరిస్థితులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు తెలియజేసినట్లు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు మాజీ ఎమ్మెల్సీ తొండపు దశరథ జనార్ధన్ తెలిపారు. ఆదివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను కలసిన టీడీ జనార్ధన్ గత రెండు మూడు రోజులుగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా జగ్గయ్యపేట నియోజకవర్గం లో అకాల వర్షాలు వడగళ్ళు, సుడిగాలుల వల్ల పంటలు దెబ్బతిన్నట్లు తెలియజేసినట్లు వివరించారు.

మొక్కజొన్న నేలకొరిగి, కల్లాలలో ఆరబెట్టిన మిర్చి తడిసి, కాపు కొచ్చిన మామిడి నేలరాలి, కోతకు వచ్చిన వరి చేలు వడ్లు క్రింద రాలిపోయి, అరటి గెలలతో తోటలు పూర్తిగా ధ్వంసమై నేలకొరిగి, బొప్పాయి కాయలతో చెట్లు విరిగిపోయి పంట నష్టం జరిగి రైతులు దిగాలు చెందారని వివరించడం జరిగిందన్నారు.


రైతులు ఆరుగాలం కష్టపడి లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంటకు చేతికి వచ్చే సమయంలో ఊహించని విధంగా ప్రకృతి వైపరీత్యాల వలన రైతులు నష్టపోతున్నారని, వారిని తక్షణమే ఆదుకోవాలని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది అన్నారు. వెంటనే సంబంధిత అధికారులను పిలిచి రైతులు నష్టపోయిన ప్రతి పంటను నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

Leave a Reply