చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహారాణికి ఘన నివాళి

ఉట్నూర్, ఆంధ్రప్రభ : మరాఠా సామ్రాజ్యంలోని మాల్వా ప్రాంతానికి చెందిన ప్రముఖ పాలకురాలు మహారాణి అహల్యాబాయి హోల్కర్ 301వ జయంతి వేడుకలను ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని సాలెవాడ (కే) గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించి, ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, మహారాణి అహల్యాబాయి న్యాయపాలన, ధార్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యతనిచ్చిన గొప్ప పాలకురాలని పేర్కొన్నారు. భారత చరిత్రలో ఆమె “రాజమాత”, “లోకమాత”గా చిరస్మరణీయురాలిగా నిలిచారని అన్నారు.

అహల్యాబాయి 1725 మే 31న ప్రస్తుత మహారాష్ట్రలోని అహల్యానగర్ (అప్పటి అహ్మద్‌నగర్) జిల్లా చౌండి గ్రామంలో జన్మించారు. మాల్వా ప్రాంత సైనికాధికారి మల్హర్‌రావు హోల్కర్ కుమారుడు ఖండేరావ్ హోల్కర్‌తో ఆమె వివాహం జరిగినట్లు వివరించారు.

చిన్న వయస్సులోనే భర్త ఖండేరావు యుద్ధంలో మరణించగా, అనంతరం మామ మల్హర్‌రావు, కుమారుడు మాలేరావు మరణించారని తెలిపారు. కుటుంబంలో వరుస విషాదాలు ఎదురైనా ధైర్యం కోల్పోకుండా 1765లో మాల్వా రాజ్య పాలనా బాధ్యతలు చేపట్టారని చెప్పారు.

సైన్యాన్ని స్వయంగా నడిపించి యుద్ధాలను సమర్థవంతంగా ఎదుర్కొన్న అహల్యాబాయి, రాజధానిని ఇండోర్ నుంచి నర్మదా నది తీరంలోని మహేశ్వర్‌కు మార్చారని పేర్కొన్నారు. ఆమె పాలనలో మహేశ్వర్ చేనేత పరిశ్రమ, కళలకు కేంద్రంగా అభివృద్ధి చెందిందన్నారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు ప్రజారంజక పాలన అందించిన గొప్ప పాలకురాలిగా ఆమె గుర్తింపు పొందారని వివరించారు.

ఈ జయంతి కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సాల్గేర్ రవీందర్, శుక్ల శ్యాంప్రసాద్ మహారాజ్, నిర్వాహకులు సీహెచ్ మారుతి, జాదవ్ నర్సింగ్, నాయకులు సాగర్, మనోహర్, జాదవ్ ఓం, రాందాస్, శంకర్, నారాయణ, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply