వైభవంగా హనుమజ్జయంతి వేడుకలు

వైభవంగా హనుమజ్జయంతి వేడుకలు
- ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక పూజలు..
- భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు
- నాలుగు వేదికలపై శాస్త్రోక్తంగా అభిషేకాలు, ఆకుపూజలు
- పాల్గొన్న చైర్మన్, ఈఓ దంపతులు
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ ; విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన హనుమజ్జయంతి వేడుకలు మంగళవారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగాయి.వేలాదిమంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణం అంతా హనుమ నామస్మరణతో మారుమోగింది. వైదిక కమిటీ సూచనల మేరకు ఉదయం 6 గంటల నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
ఘాట్ రోడ్డులోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయం, ప్రధాన ఆలయ ప్రాంగణంలోని క్షేత్రపాలక శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, మెట్ల మార్గంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, సీతానగరం ఉపాలయంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాల్లో ఏకకాలంలో శాస్త్రోక్తంగా అభిషేకాలు, తమలపాకులతో ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో దేవస్థాన పాలకమండలి అధ్యక్షుడు బొర్రా రాధాకృష్ణ దంపతులు, కార్యనిర్వహణాధికారి శీనా నాయక్ దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని భక్తులతో కలిసి ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదించారు. రంగురంగుల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించిన ఆలయాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అధికారుల సమన్వయం, సిబ్బంది కృషితో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు నిర్వహించబడ్డాయి. స్వామివారి అనుగ్రహం అందరికీ కలగాలని దేవస్థాన అధికారులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక కాంతితో వెలుగొందగా, హనుమజ్జయంతి వేడుకలు భక్తుల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచాయి.
