అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు
తిరువూరు, ఆంధ్రప్రభ ; దీర్ఘకాలంగా తిరువూరులో పలు ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. 4 సంవత్సరాల క్రితం ఏర్పడిన రెవిన్యూ డివిజనల్ కార్యాలయాన్ని తాత్కాలికంగా ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసి తదుపరి పక్కా భవనాలు నిర్మించాలని అప్పట్లో నిర్ణయించారు. ఇంతవరకు ఆర్డీవో కార్యాలయ భవన నిర్మాణం చేపట్టకపోవడంతో స్టేడియంలోనే కొనసాగిస్తున్నారు.
తిరువూరు డివిజన్ కేంద్రానికి ఏకొండూరు, గంపలగూడెం, విస్సన్నపేట, రెడ్డిగూడెం మండలాల నుంచి వచ్చే ప్రజలు, అధికారులు ఆర్డీవో కార్యాలయానికి వెళ్ళడానికి సరైన రవాణా సదుపాయం లేదు. ఆర్టీసీ బస్టాండు నుంచి 4 కిలోమీటర్ల దూరం ఉండటంతో కనీసం రూ.100 చెల్లించి ఆటోలలో వెళ్ళవలసి వస్తోంది. సమీక్షా సమావేశాలు, అధికారిక కార్యక్రమాలకు వివిధ శాఖల అధికారులు ఆర్డీవో కార్యాలయానికి వచ్చి వెళ్ళడం భారంగా మారుతోంది.
అంచనాలకే పరిమితం
నాలుగు మండలాల్లో 200కు పైగా అంగన్వాడీ కేంద్రాలున్న తిరువూరు ఐసీడీఎస్ ప్రాజెక్టుకు సొంత భవనం లేదు. గతంలో ఆర్టీసీ బస్టాండు సమీపంలో నడిం తిరువూరు పీఏసీఎస్ భవనం పక్కన ఐసీడీఎస్ కార్యాలయానికి సొంత భవనం ఉంది. ఈ భవనం నిర్మించిన పదేళ్ళకే శిధిలమవడంతో గత 15 సంవత్సరాలుగా అద్దె భవనాల్లోనే కార్యాలయం కొనసాగుతోంది. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు ప్రాజెక్టు స్థాయి సమావేశాల కోసం కాన్ఫరెన్స్ హాలు లేకపోవడంతో షాదీఖానాలో, ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించాల్సి వస్తోంది.
ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాన్ని నిర్మిస్తే అనువుగా ఉంటుందని వివిధ మండలాల నుంచి వచ్చే అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు కోరుతున్నారు. ఎక్సైజ్ స్టేషన్, సాంఘిక సంక్షేమశాఖ ఏఎస్ డబ్ల్యూవో కార్యాలయం, సీఐ కార్యాలయాలను ప్రైవేటు భవనాల్లో వేలాది రూపాయలు అద్దెలు చెల్లించి నిర్వహిస్తున్నారు.
బస్టాండు సమీపంలో గతంలో సాంఘిక సంక్షేమ వసతిగృహం కోసం నిర్మించిన భవనం శిధిలమైనందున దానిని తొలగించి కొత్తది నిర్మిస్తే ఏఎస్ డబ్ల్యూవో కార్యాలయంతో పాటు బాలికల వసతిగృహాలను అక్కడే ఏర్పాటు చేయవచ్చని విద్యార్థుల తల్లిదండ్రులు సూచిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించాలని నియోజకవర్గం ప్రజలు కోరుతున్నారు.
