వివాహ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్

గంపలగూడెం, ఆంధ్రప్రభ : రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామంలో శుక్రవారం జరిగిన వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రెవెన్యూ డివిజనల్ అధికారి కె.కుమార్, నియోజకవర్గ శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు,సహకార సంఘం అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు గవర్నర్ కు పుష్పగుచ్ఛం అందజేసి అపూర్వ స్వాగతం పలికారు.మండలంలోని సొబ్బాల గ్రామానికి చెందిన దుర్గం భాస్కరరావు కుమారుడు గోపి గవర్నర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు.

ఆయన వివాహం కావడంతో ఆహ్వానం మేరకు అబ్దుల్ నజీర్ తన కార్యాలయంలోని ఐదుగురు సిబ్బందితో కలిసి శ్రీ కృష్ణదేవరాయ సహకార సంఘం కళ్యాణ మండపంలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొన్నారు.నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.గవర్నర్ స్వయంగా తొలిసారి ఈ ప్రాంతానికి రావడంతో ఆయనను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రజలు ఆసక్తి కనబరిచారు.గవర్నర్ రాక సందర్భంగా జిల్లా యంత్రాంగం,పోలీసు శాఖ అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసారు.