రిమ్స్ సిబ్బందితో యోగాసనాలు
రిమ్స్ సిబ్బందితో యోగాసనాలు
శ్రీకాకుళం, ఆంధ్రప్రభభ : యోగా ఆంధ్ర 2026 వేడుకల్లో భాగంగా ఆదివారం ఉదయం శ్రీకాకుళం నగరంలోని కార్గిల్ పార్కులో నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో రిమ్స్ ప్రభుత్వ వైద్య కళాశాల అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిత్యం రోగుల సేవలో, వైద్య విధుల్లో తీరిక లేకుండా గడిపే వైద్య సిబ్బందికి శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం ఎంతో అవసరమని, అందుకు యోగా చక్కటి మార్గమని అధికారులు పేర్కొన్నారు.
ఈ శిక్షణ శిబిరంలో జిల్లా ఆయుష్ అధికారి ఉత్తం రాజ్ రాణా, రిమ్స్ ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ బి. నాగేంద్ర నాయుడు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కీర్తి, జిల్లా ఆయుష్ సిబ్బంది పాల్గొన్నారు. యోగా గురువులు పాండ్రంగి మురళీకృష్ణ, కరుటూరి నాగలక్ష్మి, సాయి లక్ష్మి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధులు సురేంద్ర, గోవింద్, వాకర్స్ క్లబ్ ప్రతినిధి కాంక్యాన మురళి తదితరులు సిబ్బందికి పలు రకాల ఆసనాలు, ప్రాణాయామ పద్ధతులను నేర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,.. మానసిక ఒత్తిడిని జయించడానికి, నిత్యం ఉత్సాహంగా విధులు నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ కళాశాలకు చెందిన పలువురు వైద్యులు, అధ్యాపకులు, పారామెడికల్ సిబ్బంది, కార్యాలయ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
……
