శ్రీకాకుళం జిల్లాలో 107 కొత్త పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలు

ఎన్నికల సంఘం ఆమోదం లభిస్తే మొత్తం కేంద్రాలు 2,464కు చేరనున్నాయి

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ: జిల్లాలో ప్రస్తుతం ఉన్న 2,358 పోలింగ్ కేంద్రాలకు అదనంగా మరో 107 కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్)పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.

ఎన్నికల సంఘం ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపితే జిల్లాలో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 2,464కు చేరుతుందని కలెక్టర్ తెలిపారు. టెక్కలి నియోజకవర్గంలోని నందిగామ మండలం శారదాపురం గ్రామాన్ని మహేంద్రతనయ ఆఫ్‌షోర్ రిజర్వాయర్ కారణంగా పలాస మండలం రామకృష్ణాపురానికి పునరావాసం కల్పించిన నేపథ్యంలో, పాత శారదాపురం పోలింగ్ కేంద్రాన్ని రద్దు చేసి రామకృష్ణాపురంలో కొత్త పోలింగ్ కేంద్రాన్ని ప్రతిపాదించినట్లు వివరించారు.

నియోజకవర్గాల వారీగా ఇచ్చాపురంలో 20, పలాసలో 18, టెక్కలిలో 4, శ్రీకాకుళంలో 45, ఆముదాలవలసలో 11, ఎచ్చెర్లలో 9 కొత్త పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించగా, నరసన్నపేట, పాతపట్నం నియోజకవర్గాల్లో ఎలాంటి మార్పులు లేవన్నారు. అలాగే పలాస నియోజకవర్గంలో 7 పోలింగ్ కేంద్రాల పేర్ల మార్పులతో పాటు ఇచ్చాపురంలో ఒకటి, పలాసలో ఒకటి, టెక్కలిలో రెండు, ఆముదాలవలసలో రెండు చొప్పున మొత్తం 6 పోలింగ్ కేంద్రాల లొకేషన్ మార్పులను ప్రతిపాదించినట్లు తెలిపారు.

జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియ కొనసాగుతుందని, జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా (డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్)ను ప్రచురిస్తామని చెప్పారు. అనంతరం ఆగస్టు 20 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరించి, తుది ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 22న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియలు రాజకీయ పార్టీల సహకారంతో సజావుగా సాగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు), బూత్ లెవల్ సహాయకులతో (బీఎల్‌ఏలు) ప్రతిరోజూ సమన్వయ సమావేశాలు నిర్వహించి, ఓటర్ల గుర్తింపు, ఇళ్ల వారీగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని వేగవంతం చేయాలని సూచించారు.

ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ శాతాన్ని పెంచేందుకు రానున్న శని, ఆదివారాల్లో పోలింగ్ బూత్‌ల వద్ద ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు కోరగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించి అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్యూమరేషన్ ఫారాలను నేరుగా పంపిణీ చేయరాదని, ఓటర్ల గుర్తింపు పత్రాలకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయరాదని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్య, జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, ఈఆర్‌వోలు బి. పద్మావతి, అప్పలరాజు, ఎం. కృష్ణమూర్తి, ఆర్. వెంకటరామన్, కె. సాయి ప్రత్యూష, ఎం. లావణ్య, జి. జయదేవి, కె. వినాయకర్‌తో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పీఎంజే బాబు, అర్చన, దామ మన్మధరావు, ఐటీ కుమార్, గోవిందరావు, కెఎల్‌ఎస్ కుమారి, పి. సురేష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.