ఇళ్ల పట్టాల పంపిణీ వేగవంతం చేయాలి…

ఇళ్ల పట్టాల పంపిణీ వేగవంతం చేయాలి…
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశం
కోటబొమ్మాళి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన ఆశయమని, 2029 నాటికి లక్ష్య సాధన దిశగా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యానల సాధనకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని సూచించారు, కోటబొమ్మాళి మండలం భవానిపురం గ్రామానికి చెందిన పేద లబ్ధిదారులకు ఆయన చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల జీవితాల్లో స్థిరత్వం తీసుకురావడంలో గృహ నిర్మాణం కీలకమని పేర్కొన్నారు. ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని తెలిపారు.
గత ప్రభుత్వం లబ్ధిదారులకు చెల్లించాల్సిన సుమారు రూ.900 కోట్ల బకాయిలను పెండింగ్‌లో ఉంచడం ద్వారా గృహ నిర్మాణ రంగాన్ని పూర్తిగా దెబ్బతీశారని ఆరోపించారు. ఆ బకాయిలన్నింటినీ చెల్లించే బాధ్యతను కూటమి ప్రభుత్వం స్వీకరించిందని స్పష్టం చేశారు. అలాగే, నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి పేర్కొన్నారు. ఇకపై అలాంటి పరిస్థితులు రాకుండా సమగ్ర ప్రణాళికతో గృహ నిర్మాణ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
ఇది పేదల ప్రభుత్వం అని స్పష్టం చేసిన మంత్రి, పేదలకు న్యాయం చేయడం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ప్రభుత్వ ముఖ్య బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. ప్రతి అర్హుడైన లబ్ధిదారుడికి పారదర్శకంగా, వేగవంతంగా ఇళ్లను అందించడంలో ఎలాంటి రాజీ ఉండదని తెలిపారు. సమావేశంలో టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, నాలుగు మండలాల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
