అర్హులైన వారికి మీడియా అక్రిడిటేషన్లు మంజూరు…

అర్హులైన వారికి మీడియా అక్రిడిటేషన్లు మంజూరు…
మచిలీపట్నం – ఆంధ్రప్రభ : జిల్లాలో అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం మీడియా అక్రిడిటేషన్లు మంజూరు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి తెలిపారు.
మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్ లోని తన ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ జీవో నెం.84లో పేర్కొన్న నిబంధనల మేరకు నాలుగో సమావేశంలో మొత్తం 44 మంది పాత్రికేయులకు మీడియా అక్రిడిటేషన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇంకా అర్హత కలిగిన జర్నలిస్టులు ఆన్లైన్‌లో సమర్పించిన దరఖాస్తుల్లో వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న వాటిని పరిశీలించి తదుపరి సమావేశంలో అక్రిడిటేషన్లు మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తొలుత సమావేశంలో జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్య నిర్వాహకులు ఎం వెంకటేశ్వర ప్రసాద్ మీడియా అక్రిడిటేషన్ కు సంబంధించిన ప్రభుత్వ జీవో నెంబర్ 84 లోని నియమ నిబంధనలు, పాత్రికేయుల ఆన్లైన్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ కు వివరించారు.
సమావేశంలో జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు, వివిధ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
