దొడ్డు బియ్యం వేలం వెనుక భారీ మాయాజాలం..!
దొడ్డు బియ్యం వేలం వెనుక భారీ మాయాజాలం..!
టెండర్లలో మెలికలు.. లూటీకి పక్కా స్కెచ్..?
రీ-పాలిషింగ్ దందాతో వేల కోట్ల అక్రమార్జన ఆరోపణలు
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం..? నిపుణుల ఆందోళన
బడా రైస్ మిల్లర్ సూత్రధారిగా ప్రచారం
ప్రతిపక్షాలకు అస్త్రంగా మారే అవకాశం
సమగ్ర విచారణకు పెరుగుతున్న డిమాండ్
ధాన్యచౌర్యం మహాపాపం, ప్రజారోగ్యేణ ఖేలనమ్! ధాన్యంలో అవినీతి చేయడం మహాపాపం, ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవడం మరీ ఘోరం! కానీ కొందరు కాసుల వేటలో నిబంధనలను తుంగలో తొక్కుతూ, ప్రజా ప్రయోజనాలను పక్కనపెట్టి జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలు తీవ్రతరమవుతున్నాయి. పేదవాడి కడుపు నింపాల్సిన రేషన్ బియ్యాన్ని రాబందుల్లా కొల్లగొడుతూ, ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల గండి కొడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పేదల ఆకలి తీర్చాల్సిన రేషన్ బియ్యం చివరకు పశువుల దాణాగా, ఇథనాల్ తయారీకి వేలం వెళ్లడం ఒకవైపు అయితే, అదే బియ్యాన్ని తిరిగి రీ-పాలిషింగ్ చేసి సన్నబియ్యం పేరిట మార్కెట్లోకి, విదేశాలకు తరలిస్తూ భారీ దందాకు తెరలేపారన్న ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ధనార్జనే ధ్యేయంగా ఏకంగా రూ.3వేల కోట్ల విలువైన దొడ్డు బియ్యంపై అక్రమార్జనకు, పక్కా ప్రణాళికతో, కుట్ర పన్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో దొడ్డు బియ్యం వ్యవహారం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. సివిల్ సప్లైపై గోదాముల్లో మూడేళ్లుగా నిల్వ ఉండి ప్రజల వినియోగానికి పనికిరాదని వేలానికి పెట్టిన బియ్యం చుట్టూ వేల కోట్ల రూపాయల అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
విశ్వసనీయ సమాచారం ప్రకారం, దొడ్డు బియ్యం వేలం ప్రక్రియ చివరి విడతలో నిబంధనలకు విరుద్ధంగా మార్కెట్ ధర కంటే అత్యంత తక్కువ ధరకు కేటాయింపులు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకుని కొందరు బడా రైస్ మిల్లర్లు పందికొక్కుల్లా తయారై ప్రభుత్వ సంపదను కొల్లగొట్టేందుకు రంగంలోకి దిగారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అక్రమార్కులకు కొమ్ము కాస్తున్న కొందరు అధికారులు ప్రభుత్వ సంపదను దోచిపెట్టేలా లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం జరగాల్సిన వేలాన్ని కొందరి ప్రయోజనాల కోసం దారి మళ్లించారనే ఆరోపణలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమయ్యాయి.
టెండర్లలో మెలికలు… లూటీకి పక్కా స్కెచ్..!
గత ప్రభుత్వ హయాంలో రైతుల నుంచి సేకరించిన భారీ మొత్తంలో దొడ్డు బియ్యం సివిల్ సప్లై గోదాముల్లో నిల్వ ఉండిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సన్నబియ్యం పంపిణీ ప్రారంభించడంతో పాత నిల్వలకు వినియోగం లేకుండా పోయింది.
దీంతో భారీ నిల్వలను వేలం వేయాలని సివిల్ సప్లై శాఖ నిర్ణయించింది. మొదట కిలోకు రూ.24 ధరతో టెండర్లు పిలిచినా స్పందన లేకపోవడంతో, తర్వాత ధరను రూ.21.60కు తగ్గించి మళ్లీ టెండర్లు నిర్వహించింది. ఈ ప్రక్రియలో ఇతర రాష్ట్రాలకు చెందిన కొన్ని కంపెనీలు బిడ్లు దాఖలు చేసి నిల్వలను దక్కించుకున్నాయి.
అయితే మిగిలిన బియ్యాన్ని వేలం వేయకుండా ఇన్నాళ్లూ అడ్డుకోవడం, ఆ తర్వాత లోపాయికారి సెటిల్మెంట్లతో టెండర్లను దక్కించుకోవడం, తదనంతరం నిర్దేశిత మిల్లులకు తరలించడం వెనుక పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రీ-పాలిషింగ్ దందా… వేల కోట్ల అక్రమార్జన..!
టెండర్ల ద్వారా కొనుగోలు చేసిన దొడ్డు బియ్యాన్ని నిబంధనల ప్రకారం పశువుల దానా, ఇథనాల్ తయారీ లేదా పారిశ్రామిక అవసరాలకు మాత్రమే వినియోగించాలి. కానీ ఈ బియ్యాన్ని రైస్ మిల్లులకు తరలించి మళ్లీ రీ-పాలిషింగ్, ‘సిల్కీ’ ప్రక్రియ ద్వారా కొత్త బియ్యంలా మార్చే ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.
సాధారణంగా రీ-ప్రాసెసింగ్ చేసిన దొడ్డు బియ్యం నుంచి 70 శాతం వరకు సన్నబియ్యం లభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన వేల టన్నుల బియ్యాన్ని తిరిగి మార్కెట్లో విక్రయిస్తే వేల కోట్ల రూపాయల లాభాలు వచ్చే అవకాశం ఉందని విమర్శకులు పేర్కొంటున్నారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటం..!
ఈ వ్యవహారంలో అత్యంత ఆందోళనకర అంశం ప్రజారోగ్యం. ప్రభుత్వం ప్రజల వినియోగానికి పనికిరాదని ప్రకటించిన బియ్యం మళ్లీ ఆహారంగా మారిందా? అన్న ప్రశ్న ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది.
నాణ్యత కోల్పోయిన, దీర్ఘకాలంగా నిల్వల్లో ఉన్న బియ్యాన్ని రసాయనాల సహాయంతో రీ-పాలిషింగ్ చేసి మార్కెట్లోకి వదిలితే ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం ఆర్థిక నేరమే కాదు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే దారుణ చర్య అని అభిప్రాయపడుతున్నారు.
సూత్రధారిగా బడా రైస్ మిల్లర్..?
ఈ వ్యవహారం వెనుక తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌కు చెందిన కొందరు పెద్దల పాత్ర ఉందనే ఆరోపణలు రాజకీయంగా కూడా దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ప్రముఖ రైస్ మిల్లర్ ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారిగా వ్యవహరించాడనే ప్రచారం.
టెండర్ల ప్రక్రియ నుంచే పక్కా ప్రణాళికతో వ్యవహరించి భారీ లాభాలు ఆర్జించే కుట్ర జరిగిందని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ ఆరోపణలకు సంబంధించి అధికారికంగా ఎలాంటి నిర్ధారణ జరగలేదు.
ప్రతిపక్షాలకు అస్త్రంగా మారే ప్రమాదం..!
ఈ వ్యవహారంపై ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి తీరని మచ్చగా మారే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రూ.3 వేల కోట్ల కుంభకోణం ఆరోపణలు ప్రతిపక్షాల చేతికి చిక్కితే అసెంబ్లీ లోపలా, వెలుపలా పెద్ద ఎత్తున చర్చకు దారితీసే అవకాశం ఉందని చెబుతున్నారు.
సమగ్ర విచారణ జరపాల్సిందే..!
దొడ్డు బియ్యం వేలం, రీ-పాలిషింగ్, ఎగుమతుల పేరుతో నిజంగానే వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయా? లేక ఇవన్నీ రాజకీయ ఆరోపణలేనా? ప్రజల వినియోగానికి పనికిరాదని ప్రకటించిన బియ్యం చివరకు ఎక్కడికి వెళ్లింది? అసలు లబ్ధిదారులు ఎవరు?
ఈ ప్రశ్నలకు సమాధానం దొరికేది సమగ్ర విచారణ జరిగితేనే. టెండర్ల కేటాయింపు నుంచి నిల్వల తరలింపు, రీ-ప్రాసెసింగ్, విక్రయాలు, ఎగుమతుల వరకు ప్రతి అంశాన్ని ఉన్నతస్థాయి దర్యాప్తు సంస్థలతో క్షుణ్ణంగా విచారించాలని ప్రజలు, సామాజిక వర్గాలు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి, ప్రజల ఆరోగ్యంతో ఆటలాడిన వారెవరైనా సరే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర సరిహద్దులు దాటకముందే అనుమానాస్పద బియ్యం రవాణాను అడ్డుకోవాలని, సంబంధిత గోదాములను తనిఖీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వ్యవహారంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
