అంతంపేటలో భూ రీ-సర్వేను పరిశీలించిన ఆర్డీవో
గట్టుప్పల, ఆంధ్రప్రభ: నల్లగొండ జిల్లా గట్టుప్పల మండలంలోని అంతంపేట గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ-సర్వే ప్రక్రియను చండూరు ఆర్డీవో శ్రీదేవి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న ఆమె, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రీ-సర్వే కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, భూ రికార్డులు మరింత పారదర్శకంగా, ఆధునికంగా మారుతాయని తెలిపారు.
రైతులు తమ భూములకు సంబంధించిన పట్టాదారు పాస్‌బుక్‌లు, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇతర అవసరమైన రికార్డులను సర్వే అధికారులకు అందజేసి రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఈ తనిఖీలో తహశీల్దార్ రాములు, ఆర్‌ఐ చిరంజీవి, సర్వేయర్ జైహింద్, జీపీఓ అధికారులు రామస్వామి, అవంతి తదితరులు పాల్గొన్నారు.
