AP | క్రీడా చరిత్రలో కీలక ఘట్టం..

AP | క్రీడా చరిత్రలో కీలక ఘట్టం..

AP, ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఏపీ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.60.76 కోట్ల నిధులను మంజూరు చేయడం రాష్ట్ర క్రీడా చరిత్రలో ఒక కీలకమైన ఘట్టమని శాప్ చైర్మన్ రవి నాయుడు అన్నారు. రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిధులు కేటాయించడం ఎంతో హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. ఈ నిధులతో విజయవాడ కేంద్రంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, గుంటూరు కేంద్రంగా బీఆర్ స్టేడియం, కుప్పంలో ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణం, రాజమండ్రి, శ్రీకాకుళం జిల్లాల్లో క్రీడా వసతుల అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

ఈ ప్రాజెక్టుల ద్వారా ఆధునిక క్రీడా మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని, దీని వల్ల రాష్ట్ర యువతకు క్రీడల్లో ప్రతిభను ప్రదర్శించడానికి విస్తృత అవకాశాలు లభిస్తాయని అన్నారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, క్రీడా శాఖ మంత్రి శాప్ చైర్మన్‌గా తాను కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు విజ్ఞప్తి చేయడం జరిగిందని, వాటి ఫలితంగానే ఈ నిధులు మంజూరయ్యాయని రవి నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించడం పై చూపుతున్న నిబద్ధతకు ఇది స్పష్టమైన ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ నిధుల ద్వారా రాష్ట్రంలో గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు క్రీడా ప్రతిభను గుర్తించి తీర్చిదిద్దే అవకాశం ఏర్పడుతుందని, భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు పేరు తీసుకొచ్చే క్రీడాకారులు ఎదగడానికి ఇది దోహదపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. క్రీడాభివృద్ధికి ఈ స్థాయిలో నిధులు కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా కేంద్ర క్రీడల మంత్రికి శాప్ చైర్మన్ రవి నాయుడు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply