హరిత గోపాలం పథకం…

  • పాడి రైతులకు నూతన సంవత్సర కానుక
  • కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు..

ఆంధ్రప్రభ విజయవాడ : రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చాలసాని ఆంజనేయులు పేర్కొన్నారు.

కృష్ణా మిల్క్ యూనియన్ విజయవాడ ఫ్యాక్టరీ ఆవరణలో కృష్ణా మిల్క్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఛైర్మన్ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ… రాష్ట్రంలో మేత కొరతను సమర్థవంతంగా పరిష్కరించాలనే లక్ష్యంతో, గ్రామీణ ప్రాంతాల్లో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ కింద పశు గ్రాసం సాగును ప్రోత్సహిస్తూ, పశు గ్రాస క్షేత్రాలు, మేత నర్సరీల ఏర్పాటుకు హరిత గోపాలం పథకం ద్వారా కూటమి ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడం హర్షణీయమని తెలిపారు.

ఈ కీలక నిర్ణయానికి అనుమతి మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకి, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణ తేజ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ నిర్ణయం కూటమి ప్రభుత్వం పాడి రైతులకు అందించిన నూతన సంవత్సరపు కానుకగా అభివర్ణించారు. సమితి పాలకవర్గ సమావేశంలో, ఈ పథకాన్ని మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు.

పశు గ్రాస క్షేత్రాలు, పశు గ్రాస నర్సరీల ఏర్పాటుకు ఎంజి ఎన్ఆర్ఇజిఎస్ పధకం కింద ఆర్ధిక ప్రోత్సాహం లభిస్తుందన్నారు. పశు గ్రాస క్షేత్రాలు, పశు గ్రాస నర్సరీల ఏర్పాటుతో సంవత్సరమంతా పశు గ్రాస అందుబాటులో ఉంటుంది… తద్వారా, పాడి పశువుల ఉత్పాదకత పెరిగి, పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందన్నారు.

మహిళలకు పశు గ్రాస సాగు ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి అవకాశాలు కలుగుతాయన్నారు. రైతులు పశు గ్రాసాన్ని మామిడి, పామ్ ఆయిల్ తోటల్లో అంతర పంటగా సాగు చేసి అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వ స్థలాలు, కమ్యూనిటీ స్థలాలు , దేవాదాయ భూములలో గడ్డి పెంచుకొనే వేసులబాటు ఉంటుందన్నారు.

పశువుల హాస్టల్స్ స్థాపనకు ప్రోత్సాహం ఇవ్వడం రైతుల సంక్షేమం అభివృద్ధి పట్ల కూటమి ప్రభుత్వ నిబద్ధతకు స్పష్టమైన నిదర్శనమని తెలిపారు. కృష్ణా మిల్క్ యూనియన్ పరిధిలోని పాడి రైతులకు మేలైన పశు గ్రాస విత్తనాలు, కనుపులు అందించి వారిని పశు గ్రాస క్షేత్రాలు, మేత నర్సరీల ఏర్పాటుకు ప్రోత్సహించి, ఈ హరిత గోపాలం పథకానికి యూనియన్ తమ వంతు సహకారం అందిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమం లో మేనేజింగ్ డైరెక్టర్ కొల్లి ఈశ్వర బాబు, కృష్ణా మిల్క్ యూనియన్ పాలక వర్గ సభ్యులు, ట్రస్ట్ సభ్యులు ఫీడ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply