Drinking water | వేసవి రాకముందే..

Drinking water | వేసవి రాకముందే..
- మొదలైన తాగునీటి కష్టాలు
- 10 రోజులుగా సరఫరా బంద్..
- అష్ట కష్టాలు పడుతున్న బీమవరం గ్రామ ప్రజలు
Drinking water | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : వేసవి కాలం ఇంకా మొదలు కానప్పటికీ, ఈ ఏడాది అత్యధికంగా వర్షాలు కురిసినప్పటికీ, కుందూ నది ఉధృతంగా ప్రవాహించనప్పటికీ నంద్యాల మండలం బీమవరం గ్రామంలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఆ గ్రామ ప్రజలు నీటి కోసం అవస్థలు పడుతున్నారు. జిల్లా కేంద్రం నంద్యాలకు కూతవేటు దూరంలో ఉన్న భీమవరం గ్రామంలో తాగునీటి కోసం ఎక్కడ బోరు వేసినా ఉప్పు నీరే పడే పరిస్థితి గతంలో నుంచి ఉంది. పూర్వం నుంచి ఇదే పరిస్థితి ఉంది. గ్రామం పక్కనే కుందూనది పుష్కలంగా ప్రవహిస్తుంది. ప్రభుత్వం కుందూనదికి విద్యుత్ మోటార్లు బిగించి కుటుంబ అవసరాలకు గ్రామానికి నీటి సరఫరా చేస్తుంది. గ్రామ శివారులోని బీసీ కాలనీలో వేసిన ఒక బోరులో తాగేందుకు మంచి నీరు పడ్డా.. దాని నుంచి గ్రామానికి మొత్తం తాగునీరు సరఫరా చేయలేదు.

గ్రామ పరిస్థితి గమనించిన ప్రభుత్వం బండి ఆత్మకూరు మండలం బి. కోడూరు గ్రామ సమీపంలో ఒక బోర్ వేసి సుమారు 8 కిలోమీటర్ల దూరం పైపు లైన్ ద్వారా బీమవరం గ్రామానికి తాగునీటి సరఫరా చేస్తోంది. ఇటీవల ఆ తాగునీటి సరఫరా బోరు మరమ్మతులకు గురై గత పదిరోజులుగా గ్రామానికి తాగునీటి సరఫరా నిలిచింది. తాగునీటి కోసం కష్టాలు పడుతున్నామని, ప్రయివేటు మినరల్ వాటర్ ఫ్లాంట్ వారిని ఆశ్రయించి అధిక డబ్బులు వెచ్చించి తాగునీరు కొంటున్నామని గ్రామస్థులు వాపోతున్నారు. గతంలో కుందూ బ్రిడ్జి వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన లక్షన్నర రూపాయల విలువైన నీటి పంపింగ్ విద్యుత్ మోటారును చోరీకి గురైంది. ఇటీవల నూతన గ్రామ సచివాలయం ప్రారంభానికి గ్రామానికి వచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులు దీనిని పట్టించుకోకపోవడం విశేషం. గ్రామంలో ఇంటింటికి తాగునీటి కుళాయితో మంచి నీరు ప్రభుత్వం అందిస్తుందని, ఇచ్చిన హామీని నెరవేర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. బీమవరం గ్రామ ప్రజల తాగునీరు కష్టాలు ప్రభుత్వం పరిష్కరించాలని, ఇంటింటికీ కుళాయి కనెక్షన్ ఇచ్చి తాగునీటి కష్టాలు తొలగించాలని వారు కోరుతున్నారు.
