Pothireddypadu Project | ఆంధ్రప్రదేశ్ నీటి వినియోగంపై తెలంగాణ ఆరోపణలు
Pothireddypadu Project | ఆంధ్రప్రదేశ్ నీటి వినియోగంపై తెలంగాణ ఆరోపణలు
Pothireddypadu Project | కృష్ణా జలాల వాటాపై తెలంగాణ అసంతృప్తి
పోతిరెడ్డిపాడు విస్తరణపై న్యాయ పోరాటానికి సిద్ధం
ట్రిబ్యునల్ తీర్పు రాకపోతే కోర్టులో కేసు దాఖలు
Pothireddypadu Project | హైదరాబాద్, ఆంధ్రప్రభ : కృష్ణా జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్‌కు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోసం ఏడాదిపాటు కృష్ణా ట్రిబ్యునల్‌లో వాదనలు వినిపించినప్పటికీ ట్రిబ్యునల్ ఎలాంటి అవార్డు ప్రకటించకపోవడం పట్ల తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తితో ఉంది.
ప్రధానంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను విస్తరించి శ్రీశైలం డెడ్ స్టోరేజీ నుంచి రోజుకు 88 వేల క్యూసెక్కుల నీటిని కృష్ణా బేసిన్ అవతలకు తరలిస్తున్నారని తెలంగాణ నీటిపారుదల శాఖ మండిపడుతోంది. పర్యావరణ అనుమతులు లేకున్నా పనులు కొనసాగుతున్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
దక్షిణ తెలంగాణ వరప్రదాయిని అయిన కృష్ణానది జలాల్లో న్యాయమైన వాటా కోసం ట్రిబ్యునల్‌లో అలుపెరగని పోరాటం చేసినప్పటికీ ట్రిబ్యునల్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం పట్ల విచారం వ్యక్తం చేస్తూ, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విస్తరణను నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం న్యాయ పోరాటానికి సిద్ధమైంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కృష్ణా నది నీటి వాటాగా 811 టీఎంసీల తాత్కాలిక కేటాయింపులు ఉండగా, అందులో ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల వాటా ఉంది. తెలంగాణలో కృష్ణా పరివాహక ప్రాంతం 68 శాతం ఉండగా, నీటి వాటాలో మాత్రం అన్యాయం జరిగిందని ట్రిబ్యునల్ ముందు తెలంగాణ గట్టిగా వాదించింది. అయినా ఫలితం రాకపోవడంతో కోర్టు మెట్లు ఎక్కాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తికాకపోవడం, మిగతా జలాశయాల సామర్థ్యం పెంచకపోవడంతో తెలంగాణకు కేటాయించిన 299 టీఎంసీల్లో వంద టీఎంసీలు మిగులు ఉంటున్నాయి. అయితే కృష్ణా జలాల్లో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నేరుగా నాగార్జునసాగర్‌కు రావాల్సిన నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతున్నాయని తెలంగాణ వాదిస్తోంది.
ఏటా ఆంధ్రప్రదేశ్ తన వాటాకు మించి 400 టీఎంసీల నీటిని అధికంగా వినియోగిస్తున్నట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ ఆధారాలు సేకరించినట్లు సమాచారం. కృష్ణా నది జలాల్లో వాటా పెంపు కోసం తెలంగాణ ఒకవైపు పోరాటం చేస్తున్నప్పటికీ, మరోవైపు ఏపీ ప్రభుత్వం రాయలసీమకు నీటిని మళ్లించే పనులను వేగవంతం చేసింది.
ఇప్పటికే సంగమేశ్వరం (రాయలసీమ) ఎత్తిపోతల పథకం పనులను దాదాపుగా పూర్తిచేసి, పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించుకుపోతున్నదని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తోంది. సంగమేశ్వర ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.6,829.15 కోట్లతో పరిపాలనా పరమైన అనుమతులు ఇచ్చినట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఆధారాలు సేకరించింది.
ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేకపోయినప్పటికీ శరవేగంగా పనులను ఆంధ్రప్రదేశ్ పూర్తి చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ భావిస్తోంది. శ్రీశైలంలో 854 అడుగులకు నీటిమట్టం చేరితేనే పోతిరెడ్డిపాడు నుంచి నీరు తోడుకుంటామని ఏపీ చెబుతున్నప్పటికీ, ఆచరణలో అది జరగడం లేదని తెలంగాణ మండిపడుతోంది.
పోతిరెడ్డిపాడు అంశంలో కృష్ణా ట్రిబ్యునల్ తెలంగాణకు న్యాయం చేయని పక్షంలో కోర్టులో కేసు దాఖలు చేసేందుకు తెలంగాణ నీటిపారుదల శాఖ సిద్ధమైనట్లు సమాచారం.
