Rs 3.24 crore | లోవోల్టేజి సమస్యలకు శాశ్వత పరిష్కారం

Rs 3.24 crore | లోవోల్టేజి సమస్యలకు శాశ్వత పరిష్కారం
- ట్రాన్స్ కో హుజూర్ నగర్ డిఈ వెంకట కృష్ణ
- 4 నూతన విద్యుత్ సబ్ స్టేషన్ ల నిర్మాణం
- రూ 14 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్లలో సామర్థ్యం పెంపు
Rs 3.24 crore | నేరేడుచర్ల, ఆంధ్రప్రభ : స్థానిక శాసనసభ్యులు, మంత్రి కెప్టెన్ నలమద ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) చొరవతో హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు హుజూర్ నగర్ డిఈ ఎన్ వెంకటకృష్ణ తెలిపారు. బుధవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల ట్రాన్స్ కో (Trans Co) కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో నాలుగు చోట్ల నూతన విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చిందన్నారు. రూ3.24 కోట్ల(Rs 3.24 crore)తో నేరేడుచర్ల మండలం యల్లాపురంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయ్యిందని ఈనెల చివరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.
అలాగే చిలుకూరు మండలం కొండాపురంలో రూ.2.08 కోట్లతో కోదాడ నియోజకవర్గంలోని కూచిపూడి లో రూ.2.06 కోట్లతో నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్లు కూడా ఈ నెలలోనే ప్రారంభించేందుకు పనులు వేగవంతంగా చేపడుతున్నట్లు తెలిపారు. రూ.2.50 కోట్లతో మఠంపల్లి మండలం చెన్నాయపాలెంలో నిర్మించనున్న 33/11 విద్యుత్ సబ్ స్టేషన్(33/11 Electricity Sub Station) శంకుస్థాపనకు సిద్ధంగా ఉందన్నారు.
ఇవే కాకుండా దిర్శించర్ల, గడ్డిపల్లి, బక్కమంతుల గూడెం, బాలాజీ నగర్, మునగాల మండలం ముకుందాపురం విద్యుత్ సబ్ స్టేషన్లలో అదనపు 5ఎంఏ ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని లో ఓల్టేజీ సమస్యలు తలెత్తకుండా రూ.14 కోట్లతో రెండు నియోజకవర్గాల్లోని పలు సబ్ స్టేషన్ల సామర్థ్యం పెంపు, నవీకరణ పనులు చేపడుతున్నామన్నారు.
ప్రస్తుతానికి రూ.4 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. రెండు నియోజకవర్గాల్లో 4,930 మంది రైతులు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకొన్నారని, వీరందరికీ 570 ట్రాన్స్ ఫార్మర్లు(570 Transformers), 90 కిలోమీటర్ల వైరు, 290 కిలోమీటర్ల కేబుల్ యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తున్నామన్నారు.
దిర్శించర్ల, కల్మలచెరువుతో పాటు కీతవారిగూడెం ముత్యాల నగర్ వరకు రూ.1.20 కోట్లతో 33 కేవీ విద్యుత్ లైన్ నిర్మిస్తున్నామని త్వరలో పూర్తవుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా లో వోల్టేజి సమస్యలు లేకుండా విద్యుత్ శాఖ కృషి చేస్తుందన్నారు. సమావేశంలో ఏడి నాగిరెడ్డి, నేరేడుచర్ల, పాలకవీడు ఏఈలు సృజన, పందిరి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
