41 మంది మావోయిస్టుల లొంగుబాటు..

- 12 మంది మహిళలు..
- రూ. కోటీ 19 లక్షలు రివార్డు
చర్ల, ఆంధ్రప్రభ : ఛత్తీస్‌గఢ్‌లో 12 మంది మహిళలతో పాటు 41 మంది మావోయిస్టులు బుధవారం లొంగిపోయారు. లొంగిపోయిన వారిపై రూ. కోటీ 19 లక్షలు రివార్డు ఉంది. గతంలో సుక్మా జిల్లాలో లొంగిపోయిన మావోయిస్టులకు సెల్ ఫోన్లు అందజేశారు. బీజాపూర్ జిల్లా జిల్లా ఎస్పీ జితేందర్ యాదవ్ ఎదుట దక్షిణ సబ్ జోనల్ బ్యూరోకి చెందిన డీకేఎస్‌జెడ్‌సీతో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీ, ధమ్తారి-గరియాబంద్ నువాపాడ్ డివిజన్‌లకు చెందిన 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
లొంగిపోయిన వారిలో 39 మంది సౌత్ సబ్ జోనల్ బ్యూరో సభ్యులు ఉండగా, మండా డివిజన్ కమిటీ సభ్యుడు, సీఆర్‌సీ బృంద పీపీసీఎం సభ్యుడు, అవ్డూయి, బాయినార్, పారతాపూర్, ఉత్తర బ్యూరో కమిటీ, కుతుల్ ఏరియా కమిటీలకు చెందిన ఆరుగురు ఏసీఎంలు, మిలటరీ కంపెనీకి చెందిన ఆరుగురు, ప్లాటూన్ – 36 కి చెందిన నలుగురు మావోయిస్టులు, సాంకేతిక పీఎం సభ్యులు నలుగురు, పూర్వ బస్తర్ డివిజన్ పీఎం సభ్యులు ముగ్గురు, మండా, ఉత్తర్ బస్తర్ డివిజన్ పీఎం సభ్యులు ముగ్గురు, మండా, పూర్వ బస్తర్ డివిజన్‌ల జనతన్ సర్కార్ సభ్యులు ఆరుగురు ఉన్నారు.
ఈ ఏడాది జనవరి నుండి నేటి వరకు 528 మంది మావోయిస్టులను అరెస్ట్ చేయగా 560 మంది మావోయిస్టులు లొంగిపోయారు. కాగా 144 మంది మావోయిస్టులు వివిధ ఎన్‌కౌంటర్లలో మృతి చెందారు. లొంగిపోయిన వారికి పునరావాసం కింద ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అందజేసిన చెక్కులను పంపిణీ చేశారు.
మావోయిస్టులకు సెల్ ఫోన్లు
సుక్మా జిల్లాలో గతంలో లొంగిపోయిన మావోయిస్టులకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సెల్ ఫోన్లను అందజేశారు. పునరావాసంలో భాగంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన్ని తెలుసుకునేందుకు అక్కడ పోలీసులు 5జీ సెల్ ఫోన్లను పంపిణీ చేశారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ఆదేశాల మేరకు 25 మంది మావోయిస్టులకు కలెక్టర్ దివేష్ కుమార్ సెల్ ఫోన్లులను అందజేశారు.
భారీ డంప్ స్వాధీనం
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో బుధవారం భద్రతా బలగాలు మావోయిస్టులకు చెందిన భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. సుక్మా జిల్లాలోని సీఆర్పీఎఫ్ క్యాంప్ పరిధి పాలగూడ అటవీ ప్రాంతంలో పోలీసులను లక్ష్యంగా చేసుకుని ఏర్పాటు చేసిన మందుపాతరను భద్రతా బలగాలు గుర్తించి నిర్వీర్యం చేశారు. అలాగే డంప్‌లోని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
