GOAL | మహిళా అభివృద్ధే లక్ష్యం

GOAL |మహిళా అభివృద్ధే లక్ష్యం
- డ్వాక్రా మహిళలకు రూ.590 కోట్ల రుణాల పంపిణీ
- 18 ఏండ్ల పైబడిన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు
- వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
GOAL |సంగారెడ్డి ప్రతినిధి, (ఆంధ్రప్రభ): మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ఆదివారం సంగారెడ్డి కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డితో (With TGIIC Chairperson Nirmala Jagga Reddy) కలిసి దామోదర్ రాజనర్సింహ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో డ్వాక్రా మహిళలకు రూ.590 కోట్ల రుణాలతోపాటు రూ.32 కోట్ల వడ్డీ రాయితీ పంపిణీ చేశామని, 18 ఏండ్లు పైబడిన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తామని తెలిపారు. 1990లో మొదలైన మహిళా సంఘాల గ్రూపులు కాల క్రమంలో 2004, 2014 మధ్య పావలా వడ్డీ లేని రుణాలు అందించింది, ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్టు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం డ్వాక్రా మహిళలను ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళల అభివృద్ధి కోసం అనేక రకాల కార్యక్రమాలను చేపట్టిందన్నారు.
మహిళా స్వావలంబనకు పథకాలు..
మహిళా స్వావలంబనకు ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోందని, సోలార్ ప్లాంట్లు, మహిళా శక్తి క్యాంటీన్లు (Women’s Power Canteens) పెట్రోల్ బంకులు, బస్సుల కొనుగోలు వంటి పలు వ్యాపారాల్లో మహిళా సంఘాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. స్వయం ఉపాధి పథకాల ద్వారా వేలాది మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారని చెప్పారు.
ఆడబిడ్డల ఆశీర్వాదం.. దేవుళ్ల కంటే శ్రేష్టం..
ఆడబిడ్డల ఆశీర్వాదం అన్ని దేవుళ్ల కంటే శ్రేష్టమని మంత్రి పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలు, గ్రామాలు, సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ముఖ్యంగా మహిళలకు విద్య అవకాశాలను మెరుగుపరచడం కోసం ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నట్లు తెలిపారు. వారు చదువుకుంటే కుటుంబం బాగుపడుతుందని, కుటుంబాలు బాగుపడితే గ్రామాలు బాగుపడతాయని దామోదర రాజనర్సింహ అన్నారు. తెల్ల రేషన్ కార్డులో పేరు నమోదై ఉండి పార్టీలతో సంబంధం లేకుండా 18ఏండ్లు నిండిన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మాలాజగ్గారెడ్డి (TGIIC Chairperson Nirmala Jagga Reddy) మాట్లాడుతూ.. మహిళలకు అన్ని రకాలుగా ప్రజా ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని చెప్పారు. వాటిని సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అని ఆమె సూచించారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జిల్లాలో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాల ద్వారా కలిగిన ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫయీమ్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, సీడీసీ చైర్మన్ గడీల రాంరెడ్డి, అడిషనల్ డీఆర్డీఓ సూర్యారావు, జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.
