CONTAINER SCHOOL |ఆద‌ర్శం అంతేనా?

మిగిలిన గ్రామాల‌కు విస్త‌రించ‌ని వైనం

CONTAINER SCHOOL |ములుగు జిల్లా ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : అట‌వీశాఖ అభ్యంత‌రాల‌తో ఎన్నో ఆదివాసీ గ్రామాల అభివృద్ధి ఆగిపోయింది. చిన్నారుల‌కు నీడ క‌ల్పించే పాఠ‌శాల నిర్మాణాల‌కు, అలాగే రోగుల‌కు ఆశ్ర‌యం ఇచ్చే ఆస్ప‌త్రి భ‌వ‌నాల నిర్మాణాల‌కు కూడా అట‌వీశాఖ చ‌ట్టాలు అడ్డు వ‌స్తున్నాయి. ప్ర‌భుత్వం నుంచి నిధులు మంజూర‌వుతున్నా… అట‌వీశాఖ అభ్యంత‌రాల‌తో భ‌వ‌నాల నిర్మాణాల‌కు అవ‌కాశం లేక‌పోతుంది.

ఈ క్ర‌మంలో రాష్ట్ర పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి ధ‌న‌స‌రి ఆన‌సూయ (సీత‌క్క‌), ములుగు క‌లెక్ట‌ర్ దివాకర టీఎస్ ఓ ప్ర‌ణాళిక రూపొందించారు. ఆ ప్ర‌ణాళిక‌లో భాగంగా కంటైన‌ర్ భ‌వ‌నాల నిర్మాణానికి శ్రీ‌కారం చుట్టారు. అయితే ఇదొక ఆద‌ర్శ‌మ‌ని… జిల్లాతోపాటు రాష్ట్ర‌మంతా కంటైన‌ర్ భ‌వ‌నాలు నిర్మించాల‌ని ఆలోచ‌న కూడా చేశారు. అలాగే ములుగు జిల్లాలో మ‌రో మూడు గ్రామాల్లో నిర్మించాల‌ని ప్ర‌తిపాద‌న‌లు కూడా చేశారు. కానీ ఇంత‌వ‌ర‌కు ఏదీ కార్య‌రూపం దాల్చ‌లేదు. ములుగు జిల్లాలో ఒక కంటైన‌ర్ ఆస్ప‌త్రి, రెండు పాఠ‌శాల‌లు నిర్మించి అధికారులు చేతులు దులుపుకున్నారు.

బంగారుప‌ల్లిలో కంటైన‌ర్ పాఠ‌శాల‌కు బాట!
ములుగు జిల్లా కేంద్రాన్ని వంద కిలోమీట‌ర్ల దూరం… క‌న్నాయిగూడెం మండ‌లం కంతనపల్లి పంచాయ‌తీ బంగారుపల్లి గూడెం.. అక్క‌డ గుత్తికోయ ఆదివాసీ తెగ‌కు చెందిన పిల్ల‌లు ఉన్నారు. ప్ర‌భుత్వం నిధులు మంజూరు చేసినా అటవీశాఖ అభ్యంత‌రాల‌తో భ‌వ‌న నిర్మాణాల‌కు నోచుకోలేదు. ఈ గూడానికి సరైన రోడ్డు సదుపాయం, విద్యుత్, మొబైల్ కనెక్టివిటీ లేదు. ఇది పూర్తిగా అభివృద్ధికి నోచుకోలేక అక్షరాస్యతకు దూర‌మైంది.

బంగారు పల్లి కి 2010లో మండల ప్రజా పరిషత్ పాఠశాలను మంజూరు చేశారు. గూడెంలోని ప్రజలు అందించిన సహకారంతో తాత్కాలికంగా పాఠశాలను గుడిసెలో ఏర్పాటు చేశారు. దీనిలో తరగతి గదులు, ఫర్నిచర్ ,విద్యుత్ వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలు లేవు. అటవీ శాఖ ఆంక్షల కారణంగా, నివాస స్థలం అటవీ జోన్‌లో ఉన్నందున శాశ్వత (పక్కా) నిర్మాణానికి అనుమతి లభించలేదు.

దీంతో ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులు దశాబ్దానికి పైగా ప్రయత్నాలు చేసిన ఫలితం రాలేకపోయింది. అటవీశాఖ నుంచి అనుమతులు రాకపోయే సరికి శాశ్వత భ‌వ‌నానికి మోక్షం కలగలేదు. దీంతో బంగారు పల్లిలో విద్యార్థులకు పాఠాలను గుడిసె లోనే బోధించేవారు. 2022 సంవత్సరం వరకు పాఠశాలలో 25 మంది విద్యార్థులకు గాను నియ‌మించారు.

జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, మంత్రి సీతక్క చొరవతో బంగారుప‌ల్లిలో కంటైనర్ బడికి బాటలు వేశారు. అందుకు ప్ర‌భుత్వం కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ క్రమంలోనే రూ .13 లక్షల నిధులతో కంటైనర్ పాఠ‌శాల‌ను నిర్మించారు.

మ‌రో మూడు గ్రామాల్లో ప్ర‌తిపాద‌న‌లు
జిల్లాలోని ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి , మామిడి గూడెం గ్రామాలలో కంటైన‌ర్ పాఠ‌శాల‌లు ఏర్పాటుకు ప్ర‌తిపాద‌న‌లు త‌యారు చేశారు. కానీ ఇంత‌వ‌ర‌కు కార్య‌రూపం దాల్చ‌లేదు. ప్రభుత్వం వెనుకబడిన విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు కంటైనర్ బడులను ప్రారంభిస్తే బాగుంటుందన్న ప‌లువురు కోరుతున్నారు.

Leave a Reply