Nandyal | ఉద్యోగం కావాలంటే రూ.3లక్షల డిపాజిట్

Nandyal | ఉద్యోగం కావాలంటే రూ.3లక్షల డిపాజిట్

రూ.35 కోట్ల మోసంలో నలుగురు అరెస్టు


Nandyal | నంద్యాల (ఆంధ్రప్రభ బ్యూరో): “నెలకు ₹40 వేల జీతం.. ఉద్యోగం కావాలంటే రూ.3 లక్షలు డిపాజిట్ చేయాలి” అంటూ రాయలసీమలోని నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో 1200 మంది నిరుద్యోగులను మోసం చేసిన నలుగురు ముద్దాయిలను ఆళ్లగడ్డ పోలీసులు (Allagadda police) అరెస్టు చేశారు. ఆళ్లగడ్డ డీఎస్పీ కొలికేపూడి ప్రమోద్ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ… ఈ మోసంలో దాదాపు ₹35 కోట్లకు పైగా వసూలు చేశారని తెలిపారు. నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలంలోనే సుమారు 950 మంది నుంచి డబ్బులు సేకరించారని వెల్లడించారు.

అంతపు రాజారెడ్డి (అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం గొడ్డుమర్రి)
సింగతల ఉమామహేశ్వర్ రెడ్డి (నంద్యాల జిల్లా రుద్రవరం మండలం కొండమాయపల్లె)
బాచిరెడ్డి వీరారెడ్డి (దొర్నిపాడు)
బాచిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి (దొర్నిపాడు)


2023లో “వెల్త్ & హెల్త్ ఫైనాన్సియల్ సొల్యూషన్స్” (Wealth & Health Financial Solutions) పేరుతో కంపెనీ పెట్టిన ఈ గ్యాంగ్, వాట్సాప్-టెలిగ్రామ్ గ్రూపుల్లో NSE, BSE గ్రాఫ్‌ల స్క్రీన్‌షాట్లు పంపి “ఆన్‌లైన్ ట్రేడింగ్ జాబ్” అని భ్రమింపజేసింది. ముందుగా కుటుంబ సభ్యులకు చిన్న మొత్తాల్లో జీతాలు చెల్లించి నమ్మకం కల్పించి, తర్వాత గ్రామాల వారీగా వేల మందిని ఆకర్షించింది. ఒక్కొక్కరి నుంచి ₹2.5 నుంచి ₹3.5 లక్షల వరకు వసూలు చేసింది.

అక్టోబర్ 2025 నుంచి చెల్లింపులు నిలిపివేసి మొబైల్స్ స్విచాఫ్ చేసి పరారైన నిందితులను ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు దొర్నిపాడు-కొండాపురం మధ్య ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం సమీపంలో అదుపులోకి తీసుకున్నారు.

2 ల్యాప్‌టాప్‌లు
పలు మొబైల్ ఫోన్లు
131 ప్రామిసరీ నోట్ల జిరాక్స్ కాపీలు
ఇతర దస్తావేజులు.

కేసు దొర్నిపాడు పోలీస్ స్టేషన్ క్రైం నంబర్ 95/2025 కింద నమోదైంది. బీఎన్‌ఎస్‌ఎస్ చట్టం సెక్షన్ 3(5), ఏపీ పీడీఎఫ్‌ఈ యాక్ట్ సెక్షన్ 5 సహా కఠిన సెక్షన్లతో కేసు నమోదు చేశారు. “సులభంగా డబ్బు వస్తుందని నమ్మి ఎవరూ ఇలాంటి మోసపూరిత పథకాలకు బలి కావద్దు. పెద్ద మొత్తాల్లో డిపాజిట్ అడిగే వ్యక్తులు, కంపెనీల పట్ల అప్రమత్తంగా ఉండాలి” అని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply