MLA | బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి

MLA | బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి
భక్తులకు ఎలాంటి అసౌకర్యములు కలగకుండా చర్యలు తీసుకోవాలి
ఎమ్మెల్యే వంశీకృష్ణ
MLA | అచ్చంపేట, ఆంధ్రప్రభ : నవంబర్ 30 నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు పదర మండలం, మద్దిమడుగులోని శ్రీశ్రీశ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దేవస్థాన వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా విజయవంతమయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అచ్చంపేట ఎమ్మెల్యే (MLA) డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ (Dr. chikudu Vamsi Krishna) ఆదేశించారు. ఈ మేరకు సోమవారం అచ్చంపేట పట్టణంలోని ప్రజా భవన్ క్యాంప్ కార్యాలయంలో ఆలయ అపధర్మ ధర్మకర్త, పాలకమండలి సభ్యులు, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మద్దిమడుగు ఆంజనేయస్వామి (Anjaneya Swamy) వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలని, హాజరయ్యే భక్తులకు త్రాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, విద్యుత్ మొదలైన వాటిపైన అధికారులు ఇప్పటినుండే దృష్టి పెట్టి భక్తులకు, ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా తగు ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు.
దేవాలయ ఆవరణంలో త్వరలోనే సెల్ ఫోన్ టవర్ (Cell phone tower) ఏర్పాటు చేయడం జరుగుతుందని, భక్తులందరికీ సమాచార వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, డీఎస్పీ పల్లె శ్రీనివాసులు, అమ్రాబాద్ సిఐ శంకర్, మద్దిమడుగు దేవస్థాన ఆపధర్మ చైర్మన్ దేశవత్ రాములునాయక్, ఈవో రంగాచార్యులు, ఆలయ పూజారి, పాలకమండలి డైరెక్టర్లు, అన్ని విభాగాల అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
