AP | భారీ వాహనాలు వెళ్లొద్దు..

AP | భారీ వాహనాలు వెళ్లొద్దు..

కుందూ పాత వంతెన పునరుద్ధరణ పనులు ప్రారంభించాం….
రాకపోకలకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక చర్యలు…
జిల్లా కలెక్టర్


AP | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల నుంచి నందమూరి నగర్ మీదుగా వెళ్లే పన్నెండు గ్రామాలకు కుందూనది పాత వంతెన పరిస్థితిని కలెక్టర్ (Collector) పరిశీలించారు. శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అన్నారు. గురువారం నంద్యాల పట్టణంలోని పాత కుందు నది వంతెన ప్రస్తుత స్థితిని జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, ఆర్డిఓ విశ్వనాథ్, మున్సిపల్ కమిషనర్ శేషన్నలతో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… కుందూ నది పాత వంతెన శిథిలావస్థకు చేరుకున్న దృష్ట్యా ప్రభుత్వం ఇప్పటికే నూతన వంతెన నిర్మాణానికి భూసేకరణ నిధులు విడుదల చేసిందన్నారు.

కొత్త వంతెన (new bridge) పూర్తవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని… అంతవరకు రాకపోకలకు ఇబ్బంది కలగకుండా పాత వంతెనను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం వంతెన సామర్థ్యాన్ని పెంచేందుకు బిటుమినస్ (బిటి) లేయర్ వేసి, వంతెనకు ఇరువైపులా ఇనుప రైలింగులు ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. ఈ పనులు వారం రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు.

వంతెన దృఢతను దృష్టిలో ఉంచుకుని, తాత్కాలికంగా స్కూల్ బస్సులు, అంబులెన్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు, రైతుల ట్రాక్టర్లు మాత్రమే ఈ వంతెన మీద వెళ్లేలా అనుమతిస్తామన్నారు. భారీ వాహనాల (Heavy vehicles) ను మళ్లించే చర్యలు ఇప్పటికే ప్రారంభించామని కలెక్టర్ వెల్లడించారు. కొత్త వంతెన పనులు పూర్తయ్యేంత వరకు పాత వంతెన వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని, అధికారులు సూచించిన నియమాలను తప్పక పాటించాలని కలెక్టర్ ప్రజలను విజ్ఞప్తి చేశారు.

అంతకు ముందు జిల్లా కలెక్టర్ మున్సిపల్ కార్యాలయం (Municipal Office) వెనుక ఉన్న ఖాళీ స్థలాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన కొత్త కార్యాలయ భవనాల నిర్మాణం కోసం ఆ స్థలాలను ఉపయోగించే అవకాశాలపై ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

Leave a Reply