kidnap | కిడ్నాప్ కేసులో ముగ్గురి అరెస్ట్

kidnap | పలాస(శ్రీకాకుళం), ఆంధ్రప్రభ : బిల్డింగ్ లీజ్ వ్యవహారంలో తలెత్తిన ఆర్థిక వివాదం నేపథ్యంలో పలాస పట్టణానికి చెందిన వైశ్యరాజు లక్ష్మీనారాయణ రాజు అనే వ్యక్తిని బలవంతంగా కారులో ఎక్కించుకొని దాడిచేసి, బెదిరించి, అనంతరం వదిలిపెట్టిన ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఉదయం కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌లో విలేక‌రుల సమావేశంలో అదనపు ఎస్పి క్రైమ్ పి శ్రీనివాసరావు మాట్లాడుతూ..

ఫిర్యాదుదారుడు పలాసకు చెందిన వ్యక్తి తనకు ఆమదాలవలసలో ఉన్న బిల్డింగ్‌ను ముద్దాయి పొట్నూరు వేణు గోపాలరావుకు 65 లక్షల రూపాయ‌లకు లీజుకు ఇచ్చాడు. ఆ భవనంలో వేణుగోపాలరావు, అతని కుటుంబ సభ్యులు కలిసి కామేశ్వరి సూపర్ మార్కెట్ నడుపుతున్నారు. ఆ బిల్డింగ్‌పై ఫిర్యాదుదారుడు బ్యాంకు లోన్ తీసుకొని చెల్లింపులు చేయకపోవడంతో, బ్యాంకు వారు సీజ్ చేయడానికి రాగా, లీజ్ యజమాని వేణుగోపాలరావు, కుటుంబ సభ్యులు ఫిర్యాదుదారునికి రూ.కోటి ప‌ది ల‌క్ష‌లు చెల్లించారు. ఆ మొత్తానికి బదులుగా 2022లో బిల్డింగ్‌ను వేణుగోపాలరావు కుటుంబ సభ్యుల పేరుమీద తనఖా రిజిస్ట్రేషన్ చేసినట్లు, తర్వాత ఫిర్యాదుదారుడు బాకీ డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో, భవనం సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో తన స్నేహితుడు బొడ్డేపల్లి శ్రీనివాసరావు తో కలిసి చింతాడ గ్రామం వద్ద పథకం వేసి, తాతారావు, జీవన్ కుమార్,రమేష్, గణేష్, కార్ డ్రైవర్ కలిసి ఈ నెల 6న ఫిర్యాదు దారుని పలాసలోని మోర్ సూపర్ మార్కెట్ వద్ద గల సాయిరాం టీ టైమ్ వద్ద నుండి పిర్యాదుదారుని బలవంతంగా కారులో ఎక్కించుకొని వెళ్లారు. అతనిపై దాడి చేసి ప్రాణహాని కలిగించినట్లు దర్యాప్తులో తేలినట్లు ఏఎస్పీ తెలిపారు. అదేరోజు నిందితులు ఫిర్యాదుదారుని నిందితులు ఆమదాలవలస ఎఫ్గో సి డౌన్ వద్ద వదిలి పారిపోయారు. అనంతరం ఫిర్యాదుదారు కాశీబుగ్గ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా 12వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో పలాస బస్టాండ్ జంక్షన్ వద్ద ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

ఈ కేసు దర్యాప్తును జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ (క్రైమ్స్) పి.శ్రీనివాసరావు, కాశీబుగ్గ ఇంచార్జీ డీఎస్పీ ఏస్టీపీఓ టెక్కలి డి.లక్ష్మణరావు, కాశీబుగ్గ ఇన్‌ఛార్జ్ పి.సూర్యనారాయణ, ఎస్‌ఐ ఆర్.నరసింహమూర్తి ఆధ్వర్యంలో దర్యాప్తు చేశారు.

Leave a Reply