జాగ్రత్తలు తీసుకున్నాం..

  • మున్నేరు దూకుడుపై మంత్రి సత్యకుమార్ ఓదార్పు

ఆంధ్రప్రభ కంచికచర్ల : మునేరుకు వరద ఉధృతి పెరుగుతున్నందున ఆస్తి ప్రాణ, నష్టాలు సంభవించకుండా అన్ని చర్యలు చేపట్టామని ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి మంత్రి,రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గురువారం సాయంత్రం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ లతో కలసి కీసర బ్రిడ్జి వద్ద మునేరు ప్రవాహాన్ని పరిశీలించారు.

వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున పరిసర గ్రామాలు.. ముఖ్యంగా కీసర, పెండ్యాల, ఎస్. అమరవరం, వేములపల్లి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ గ్రామాల్లో ఇప్పటికే పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు చెప్పారు. వరద కారణంగా ఆస్తి, ప్రాణనష్టాలు సంభవించకుండా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ అన్ని చర్యలు చేపట్టారని, యంత్రాంగమంతా సన్నద్ధంగా ఉందని చెప్పారు.

మొంథా తుపానును స‌మ‌ష్టి కృషితో స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్నామ‌ని.. తెలంగాణ‌లో కురిసిన వ‌ర్షాల వ‌ల్ల దిగువ‌కు వ‌ర‌ద‌నీరు పోటెత్తుతోంద‌ని.. ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల‌తో ప్ర‌జ‌ల‌కు ఇబ్బందిలేకుండా చూస్తున్నామ‌ని వివ‌రించారు. ఈ కార్యక్రమంలో కంచికచర్ల తహశీల్దార్ నరసింహారావు, డి.ఎస్.పి తిలక్, మండ‌ల వ్యవసాయ అధికారి మహేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.