పార్టీ మారుతున్నానని నాపై కావాలని దుష్ప్రచారం

పార్టీ మారుతున్నానని నాపై కావాలని దుష్ప్రచారం

నేను క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తను, ఎమ్మెల్యేను
నిండిన చెరువులకు హారతి ఇచ్చి పసుపు కుంకుమలతో గంగా పూజలు
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ఆంధ్రప్రభ, చౌటుప్పల్ :
నేను పార్టీ మారుతున్నానని, పార్టీకి రాజీనామా చేస్తున్నానని కావాలని బీఆర్ఎస్ వాళ్లు, మా పార్టీలోని కొందరు నాపై దుష్ప్రచారం చేస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీకి గురువారం వచ్చిన ఎమ్మెల్యే వర్షం నీటితో నిండి అలుగులు పారుతున్న లక్కారం, తంగడపల్లి చెరువులను సందర్శించి హారతి ఇచ్చి పసుపు, కుంకుమలతో గంగా పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాజకీయంగా నేను ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రకటిస్తానన్నారు. నేను ప్రస్తుతం సిన్సియారిటీ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తను, ఎమ్మెల్యేను పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే పని చేస్తానన్నారు. నా ముందు మునుగోడు అభివృద్ది తప్ప, మరో ఆలోచన లేదని, క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి కట్టుబడి ఉంటానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. నాపై సోషల్ మీడియాలో వచ్చే దుష్ప్రచారాలను ఎవరుకూడా నమ్మొద్దని ఎమ్మెల్యే కోరారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ లోని చెరువు నిండినప్పుడు కాలనీలు జలమయం కాకుండా తీసుకోవలసిన చర్యల గురించి అధికారులతో చర్చించారు.

చౌటుప్పల్ మున్సిపాలిటీ డెవలప్మెంట్ కు రూ.500 కోట్లతో ప్రణాళిక రూపుదిద్దబోతుందని, చౌటుప్పల్ చెరువు నుండి ఏలాంటి నష్టం జరగకుండా ముందస్తుగా ప్రణాళికలు వేసి దండు మల్కాపురం, లక్కారం వద్ద వరదనీటిని డైవర్ట్ చేయడంతో మున్సిపాలిటీ ప్రజలకు వరద ముప్పు తప్పిందన్నారు. తంగడపల్లి చెరువు చుట్టు పరిసరాలను పరిశీలించి భవిష్యత్తులో ఎకో టూరిజం ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించారు.

ఈ కార్యక్రమాలలో చౌటుప్పల్ ఆర్డిఓ వెలమ శేఖర్ రెడ్డి, నీటిపారుదల శాఖ ఈఈ మనోహర్, డి ఈ రాజవర్ధన్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మండల తహసీల్దార్ వీరాబాయి, మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకట్రాంరెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, మాజీ సర్పంచ్ పబ్బు రాజు గౌడ్, యాదాద్రి భువనగిరి జిల్లా ఫిషరీస్ చైర్మన్ పాశం సంజయ్ బాబు, కొయ్యడ సైదులు, మొగుదాల రమేష్, బత్తుల విప్లవ్, సందగళ్ళ సతీష్, బోడిగె బాలకృష్ణ, ఆర్ ఐ లు బాణాల రాంరెడ్డి, కొప్పుల సుధాకర్ రావు, వివిధ శాఖల అధికారులు, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.