యువ దంపతుల ఆత్మహత్య…
భూత్పూర్, (ఆంధ్రప్రభ): మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం కొత్తూరు గ్రామంలో బుధవారం సాయంత్రం విషాదకర ఘటన చోటుచేసుకుంది. యువ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
గ్రామానికి చెందిన పోలేమోని రమేష్ (29), గోపాల్‌పేట మండలం చీర్కేపల్లి గ్రామానికి చెందిన నిర్మల అలియాస్ శ్రీలక్ష్మి (21) గత జూన్‌లో వివాహం చేసుకున్నారు. ఎల్లప్పుడూ అన్యోన్యంగా ఉండే ఈ దంపతులు ఆ రోజు ఇంట్లో ఒంటరిగా ఉన్నారు.
రమేష్ తండ్రి శ్రీశైలం వెళ్లగా, కూలీ పనులకు వెళ్లిన తల్లి మణెమ్మ సాయంత్రం ఇంటికి చేరుకుంది. అయితే, తలుపులు మూసి ఉండటంతో అనుమానం కలిగి కిటికీ ద్వారా చూడగా, నిర్మల నేలపై పడి ఉండగా, రమేష్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. వెంటనే తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా ఇద్దరూ మృతి చెందినట్లు తేలింది.
నిర్మల మరణం దాంపత్య కలహం నేపథ్యంలో జరిగిందని, లేక ఆమె స్వయంగా ఆత్మహత్య చేసుకుందా అన్నది పోలీసులు అనుమానంగా పరిశీలిస్తున్నారు. భార్య మృతి చూసి రమేష్ ఆవేశంలో ఉరేసుకున్నాడని ప్రాథమికంగా భావిస్తున్నారు.
సమాచారం అందుకున్న ఎస్సై చంద్రశేఖర్ ఆధ్వర్యంలోని పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఒక్కడే కుమారుడిని కోల్పోవడంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
