ఒకేరోజు ముగ్గురిని…

ఒకేరోజు ముగ్గురిని…

ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : సరిహద్దు మహారాష్ట్ర (Maharashtra)లోని చంద్రపూర్ జిల్లాలో ఒకే రోజు పెద్దపులి పంజా విసిరి ముగ్గురిని పొట్టన పెట్టుకుంది. చంద్రాపూర్ జిల్లా (Chandrapur district)లో సామాన్యులపై పులి దాడి చేసిన ఘటన స్థానికంగా అలజడి రేపింది. చిమూర్ తాలూకా అంబోలి ప్రాంతం లావారీ గ్రామ శివారులోని పంట పొలంలో ఎరువులు వేసేందుకు వెళ్లిన మహిళపై పెద్దపులి అటాక్ (tiger attack) చేసి హతమార్చింది. విద్యా కైలాష్ మెస్రం (42) అనే మహిళ తన భర్తతో కలిసి ఎద్దుల బండిపై కౌలుకు తీసుకున్న వరి పొలానికి ఎరువులు వేయడానికి గురువారం వెళ్ళింది. సాయంత్రం పూట పొలం వ‌ద్ద ఆమెపై పులి దాడి చేసి హతమార్చి ప‌క్క‌నే ఉన్న వాగు ఒడ్డుకు ఈడ్చుకెళ్ళింది. భర్త, కుటుంబ సభ్యులు పరుగున అక్కడికి చేరుకున్నా ఫలితం లేకుండా పోయింది. అటవీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసుల సహాయంతో, మృతుడి బంధువులకు తక్షణ సహాయం అందించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం చిమూర్‌లోని ఉప-జిల్లా ఆసుపత్రికి పంపారు. పెద్దపులి సంచారం గురించి అటవీ అధికారులు (forest officials) ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసి ఆందోళనకు దిగారు. జనారణ్యంలోకి వచ్చిన పెద్దపులిని త్వరలో పట్టుకొని బంధిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

బ్రహ్మపురి అటవీ ప్రాంతంలో మరో ఇద్దరు బలి..
చంద్రపూర్ జిల్లా బ్రహ్మపురి అటవీ ప్రాంతంలోని లకపూర్ గ్రామానికి చెందిన పశువుల కాపరి సునీల్ రౌత్ (32) పై పులి దాడి చేసి హతమార్చింది. ఇదే జిల్లా సిందేవాహీ తాలూకా ఘడ్ బోరి అటవీ గ్రామంలో గురువారం సాయంత్రం ఆరు బయట ఉన్న బాబన్ మనకర్ (10) అనే బాలుడిపై పెద్దపులి పంజా విసిరి పొట్టన పెట్టుకుంది. జనావాసంలోకి పెద్ద పులులు వచ్చి వరుసగా దాడులు చేస్తూ బలి తీసుకుంటున్నా అటవీ అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు శుక్రవారం ఆందోళన చేశారు. అటవీ అధికారులను నిలదీసి బైఠాయించారు. ఒకే రోజు చంద్రపూర్ జిల్లాలో పెద్దపులి ముగ్గురుని బలిగొన్న ఘటన సరిహద్దు అటవీ ప్రాంతాల్లో కలకలం రేపుతోంది.

Leave a Reply