Tirupati | వ్యర్థాలతో ఎనర్జీ .. సద్వినియోగం చేసుకోవాలన్న చంద్రబాబు
తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) : తిరుపతిలో ఇంత మంచి వేస్ట్ మేనేజిమెంట్ ప్లాంట్ ఉందనే విషయం మీరు నాకు చెప్పలేదు. నేను కూడా మరిచిపోయాను. ఇటువంటి ప్లాంట్ ఉపయోగించుకుని రాష్ట్రంలో ఫంక్షనల్ సర్కులర్ ఎకానమీ సెంటర్ ఏర్పాటు చేయవచ్చు అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి పర్యటనకు వచ్చిన ఆయన శనివారం మధ్యాహ్నం రేణిగుంట సమీపంలో తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహించే తూకివాకం ప్రాంతంలో దాదాపు 300 ఎకరాల విస్తీర్ణం లోని డ్రై వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్, ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్( ప్లాట్ ను ), బయో మిథనైజేషన్ గ్యాస్ ప్లాంట్, భవన నిర్వహణ వ్యర్థాల తదితర యూనిట్లను పరిశీలించారు. దాదాపు అరగంట కు పైగా ఆ ప్లాంట్ ల పనితీరును పరిశీలించిన చంద్రబాబు సంబంధిత వివరాలను, భవిష్యత్ ప్రణాళికలను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు డ్రై వేస్ట్ విక్రయాల ద్వారా, మీథేన్ గ్యాస్ విక్రయాల ద్వారా వస్తున్న ఆదాయాన్ని గురించి తెలుసుకున్నారు. ఇక్కడి ప్లాంట్ నుంచి 22 టన్నుల ఆర్గానిక్ వేస్ట్ నుంచి 750 కేజీ ల బయో గ్యాస్ ఉ త్పత్తి అవుతోందని, ఆ గ్యాస్ ను హోటళ్ల కు కేజీ రూ 76 కు విక్రయిస్తున్నామని అధికారులు వివరించారు.

ఇక్కడి ప్లాంట్ లో రీ సైకిల్ చేస్తున్న వ్యర్ధ జలాలను తాగ దానికి కూడా వినియోగిస్తున్న సింగపూర్ మోడల్ తరహా ప్రయత్నాలు చేయాలని నిర్ధేశించారు. తిరిగి వెళ్ళేటప్పుడు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తో మాట్లాడుతూ వైజాగ్ లో ఇటువంటి ప్లాంట్ ఉందని తెలుసు కానీ తిరుపతి లో ఇంట మంచి మోడల్ నా దృష్టికి తీసుకురాలేదు అన్నారు ఇదంతా 2016. 2017 మధ్యకాలంలో తిరుపతి స్మార్ట్ సిటీ పనుల కింద చేపట్టింది అని చెప్పగా మీరు చెప్పలేదు నేను కూడా మరిచిపోయాను అని అన్నారు. ఇటువంటి ప్లాంట్ లను పెద్ద ఆదాయ వనరులుగా ఉపయోగించుకోవచ్చునని అంటూ ముఖ్యంగా బయో గ్యాస్ ను కొనుక్కునే హోటళ్ల వంటి సముదాయాల నుంచి వెజిటబుల్ వెస్ట్ తీసుకుని, వారికి గ్యాస్ ఇచ్చేవిధంగా బై బ్యాక్ విధానంలో లబ్ది పొందవచ్చునని అన్నారు. ప్లాంట్ కు తగినంత వేస్ట్ కావాలంటే 40 – 50 కిలోమీటర్ల పరిధి నుంచి సేకరించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇటువంటి వేస్ట్ మేనేజిమెంట్ ప్లాంట్ ల ద్వారా రాష్ట్రంలో ఫంక్షనల్ సర్కులర్ ఎకానమీ సెంటర్ ని ఏర్పాటు చేయవచ్చినని, ఆ కోణంలో ఆలోచన చేయాలని మంత్రి నారాయణకు ఇతర అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణతో పాటు శాసన సభ్యులు అరణి శ్రీనివాసులు, బొజ్జల సుధీర్ రెడ్డి, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, స్వచ్చంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, మునిసిపల్ కమిషనర్ మౌర్య తదితరులు పాల్గొన్నారు
కపిలతీర్థంలో పూజలు ..
పర్యటనలో భాగంగా ఆయన తిరుపతి కపిలతీర్థం చేరుకుని అక్కడ కపిలేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అక్కడే స్వచ్ఛాంధ్ర భాగస్వాములతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించే ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత అలిపిరి వద్ద ఉన్న కంచి కామకోటి పీఠం మఠానికి చేరుకుని కంచి స్వాములతో సమావేశమవుతారు చంద్రబాదు .

రేణిగుంట విమానాశ్రయంలో స్వాగతం

తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం నేటి శనివారం ఉదయం 11.42 గం.లకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబుకి ఘన స్వాగతం లభించింది. రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి , జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, డీఐజీ షిమోషి బాచ్ పాయ్, జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్ , ఎస్పీ హర్ష వర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశ, తిరుపతి, సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు, నగిరి, వెంకటగిరి ఎమ్మెల్యే లు ఆరని శ్రీనివాసులు, ఆదీమూలం, నెలవల విజయశ్రీ , పాశం సునీల్ కుమార్, భాను ప్రకాష్, కె. రామకృష్ణ, పూతలపట్టు ఎమ్మెల్యే మురళి, జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్,రాష్ట్ర హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ హరి ప్రసాద్, ఏపీ గ్రీనింగ్ బ్యూటీఫికేషన్స్ చైర్మన్ సుగుణమ్మ, తుడ చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, బి జె పి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస, మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, శ్రీకాళహస్తి ఆర్డిఓ భాను ప్రకాష్ రెడ్డి, తదితర అధికారులు ప్రజాప్రతినిధులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
ఇర ముఖ్య మంత్రి వర్యులకు విమానాశ్రయం వెలుపల కార్యకర్తలు, ప్రజలు స్వాగతం పలికారు. ముఖ్య మంత్రి ఆప్యాయంగా పలకరిస్తూ అర్జీదారుల నుండి అర్జీలు తీసుకొన్నారు.

ముఖ్యమంత్రి పర్యటనలో అపశృతి.

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చూడాలన్న ఉత్సాహంతో పొరపాటున కాలుజారి కాలువలో పడిన వ్యక్తికి తీవ్రగాయాలైన ఘటన రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంగణంలో చోటుచేసుకుంది. తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం రేణిగుంట చేరుకున్న చంద్రబాబు ను చూడడానికి ప్రజలు, టిడిపి నాయకులు, కార్యకర్తలు భారీగా విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఓ కార్యకర్త కాలువపై ముఖ్యమంత్రిని చూడడానికి కాలువపై వస్తుండగా కాలువపై ఉన్న బండ విరిగి పోవడంతో కిందపడి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన అధికారులు ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
