Happy Married Life | జైనాబ్ తో అక్కినేని అఖిల్ మూడు ముళ్ల బంధం …

హైద‌రాబాద్ – టాలీవుడ్ యువ కథానాయకుడు అక్కినేని అఖిల్ ఒక ఇంటివాడయ్యాడు. జైనాబ్ రవ్జీతో కలిసి ఆయన శుక్రవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వైభవంగా జరిగిన వేడుకలో ఏడడుగులు నడిచారు. గతేడాది నవంబర్ లో వీరి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న వివాహాల్లో ఇది ఒకటిగా నిలిచింది.

ఈ వివాహ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు దిగ్గజాలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్, గ్లోబ‌ల్ స్టార్‌ రామ్‌చ‌ర‌ణ్ దంప‌తులు, ద‌గ్గుబాటి ఫ్యామిలీ ఈ కార్యక్రమానికి విచ్చేసి, వేడుకకు మరింత శోభను చేకూర్చారు. అఖిల్ తండ్రి, అగ్ర నటుడు నాగార్జున అక్కినేని, తల్లి అమల వ్యక్తిగతంగా పలువురు ప్రముఖులను ఈ వేడుకకు ఆహ్వానించారు. తెలుగు రాష్ట్రాల సీఎంలను కూడా నాగార్జున దంపతులు స్వయంగా కలిసి ఆహ్వానించడం గమనార్హం.

వధువు జైనాబ్ రవ్జీ ప్రతిభావంతురాలైన ఆర్టిస్ట్, పర్ఫ్యూమర్. ఆమె సృష్టించే ఎక్స్‌ప్రెసివ్ అబ్‌స్ట్రాక్ట్ ఆర్ట్‌వర్క్‌కు మంచి పేరుంది. అలాగే, “ఒన్స్ అపాన్ ది స్కిన్” అనే పేరుతో ఆమె నడుపుతున్న ఫ్రాగ్రెన్స్ బ్లాగ్ కూడా ఎంతో ప్రాచుర్యం పొందింది. హైదరాబాద్‌లో జన్మించిన జైనాబ్, ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నారు. ఆమె ఒక ప్రముఖ వ్యాపారవేత్తల కుటుంబానికి చెందినవారు. అంతేకాకుండా ఎం.ఎఫ్. హుస్సేన్ దర్శకత్వం వహించిన “మీనాక్షి: ఏ టేల్ ఆఫ్ త్రీ సిటీస్” చిత్రంలో కూడా జైనాబ్ చిన్న పాత్రలో నటించారు. కాగా, ఈ నెల 8 వ తేదిన రిసెప్ష‌న్ జ‌ర‌గ‌నుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *