మెగా డీఎస్సీపై అసెంబ్లీలో కీలక ప్రకటన..
16,347 పోస్టుల భర్తీ పూర్తి చేశామన్న వెల్లడి
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : డీఎస్సీ నిర్వహణపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. ఇకపై ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహిస్తామని సోమవారం అసెంబ్లీలో తెలిపారు. డీఎస్సీ నియామకాలపై ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం చెప్పడం కాదని.. ప్రభుత్వం చేపట్టిన నియామక ప్రక్రియ, పాటించిన నిబంధనల గురించి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉందన్నారు.
మెగా డీఎస్సీపై పూర్తి వివరాలను సభ్యులకు పుస్తక రూపంలో అందించినట్లు మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం డీఎస్సీని బాధ్యతగా భావించి నిర్వహించిందని, 16,347 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీ చేపట్టామని వెల్లడించారు. ఈ పోస్టులకు 3.36 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, కేవలం 148 రోజుల్లోనే నియామక ప్రక్రియ పూర్తి చేశామని పేర్కొన్నారు.
పాఠశాలల అభివృద్ధికి ఉపాధ్యాయ నియామకాలు కీలకమని మంత్రి లోకేశ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో పాఠశాల విద్యలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, గతంలో లక్షా 80 వేల మంది ఉపాధ్యాయులను నియమించినట్లు తెలిపారు. డీఎస్సీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించామని చెప్పారు.
2019 నుంచి 2024 వరకు ఒక్క టీచర్ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని మంత్రి ఆరోపించారు. వైసీపీ పాలనలో 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోయారని విమర్శించారు. ఉపాధ్యాయులకు శిక్షణ కోసం సింగపూర్, ఫిన్లాండ్ పంపిస్తే.. గతంలో వారిని మద్యం దుకాణాల వద్ద కాపలాకు పెట్టారని ఆరోపించారు.
డీఎస్సీ పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత పాటించామని లోకేశ్ తెలిపారు. 13 సబ్జెక్టులకు సంబంధించి 42 వేల ప్రశ్నలను సిద్ధం చేశామని, ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు జారీ చేశామని చెప్పారు. వచ్చిన ఫిర్యాదులను వివిధ స్థాయిల్లో పరిష్కరించామని తెలిపారు.
టీసీఎస్ ఐయాన్ వేదిక ద్వారా పరీక్ష నిర్వహించామని, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను జిల్లా యూనిట్ స్థాయిలో చేపట్టామని వివరించారు. వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్ల ప్రకారమే నియామకాలు జరిగాయని స్పష్టం చేశారు.
డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ చేస్తున్న ఆరోపణలను మంత్రి లోకేశ్ ఖండించారు. డీఎస్సీ అంటే అర్థం తెలియని వారు కూడా పేపర్ లీక్ అంటూ మాట్లాడుతున్నారని విమర్శించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయ్యాకే ఉద్యోగాలు ఇచ్చామని, ఆరోపణలు చేసే వారు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు.
