లాడ్జిలో దారుణ హత్య..
- పూర్ణానందపేటలో కలగా లాడ్జిలో ఘటన..
- మృతుడు నరేష్‌గా గుర్తింపు
- నలుగురు వ్యక్తులు గది తీసుకున్నట్లు పోలీసుల గుర్తింపు..
- మద్యం సేవించినట్లు అనుమానం
- తెల్లవారుజామున 5 గంటల సమయంలో హత్య జరిగినట్లు అనుమానం
- సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలింపు
సత్యనారాయణపురం, ఆంధ్రప్రభ : విజయవాడలోని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య చోటుచేసుకుంది. పూర్ణానందపేటలోని కలగా లాడ్జిలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతుడిని నరేష్ (35)గా పోలీసులు గుర్తించారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. నలుగురు వ్యక్తులు తాము కూలి పనులు చేసుకుంటున్నామని చెప్పి సోమవారం లాడ్జిలో గది తీసుకున్నట్లు తెలుస్తోంది. రాత్రి సమయంలో వారు మద్యం సేవించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో నరేష్‌పై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న సత్యనారాయణపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. లాడ్జిలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేకంగా గాలింపు చేపట్టినట్లు సమాచారం.
