రాగినేడులో ఘనంగా నాగుల పంచమి వేడుకలు

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : మండలంలోని రాగినేడు గ్రామంలో వెలసిన శ్రీ స్వయంభు నాగలింగేశ్వరస్వామి ఆలయంలో నాగుల పంచమి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. పర్వదినాన్ని పురస్కరించుకుని సమీప గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారికి ప్రత్యేక రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం నిర్వహించి అనంతరం విశేష అలంకరణ చేశారు. భక్తులు ‘ఓం నమః శివాయ’ నామస్మరణతో స్వామివారిని దర్శించుకుని పాలు, పండ్లు సమర్పించారు. ఆలయ పరిసరాల్లోని నాగుల పుట్ట వద్ద దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలు శివనామస్మరణతో మార్మోగాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాగినేడు గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.