Atchannaidu-Challenge : దమ్ముంటే సభకు రండి Andhra Prabha Top News
Atchannaidu-Challenge : దమ్ముంటే సభకు రండి Andhra Prabha Top News
- వైసీపీకి అచ్చెన్నాయుడు సవాల్
- ఆధారాతో సహా ,మాట్లాతుతాం
- వైసీపీకి నైతిక హక్కు లేదు
- విద్యాశాఖ మంత్రిగా మోసం చేసింది బొత్స కాదా?
- ఐదేళ్లు యువత జీవితాలతో చెలగాటమాడారు.
- ఇప్పుడు నీతులు చెబుతారా?
- కోర్టుల్లో 300 కేసులు వేసిన చరిత్ర వైకాపాదే
- వైకాపా నిర్వాకంపై బుక్‌లెట్ పంపిస్తాం
- చదువుకుని సభకు రండి
- అసెంబ్లీలో మంత్రి అచ్చెంనాయుడు
( ఆంధ్రప్రభ, అమరావతి)

Atchannaidu-Challenge : ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి నిరుద్యోగ యువతకు మెగా డీఎస్సీ పేరుతో ఆశలు చూపి, చివరకు వారిని నట్టేట ముంచిన వైకాపాకు, నాటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు ఇప్పుడు డీఎస్సీ నియామకాలపై మాట్లాడే కనీస నైతిక హక్కు లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శాసనమండలిలో డీఎస్సీపై చర్చ సందర్భంగా బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు మంత్రి అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విద్యాశాఖ మంత్రిగా ఉండి నిరుద్యోగ యువతకు ఒక్క మెగా డీఎస్సీ కూడా ఇవ్వలేకపోయిన బొత్స సత్యనారాయణ ఈరోజు డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ నీతులు మాట్లాడటం సిగ్గుచేటు. ఐదేళ్లు యువత జీవితాలతో ఆడుకున్న మీరా ఇప్పుడు నిరుద్యోగుల గురించి మాట్లాడేది? అని నిలదీశారు. 2019 నుంచి 2024 వరకు వైకాపా అధికారంలో ఉండి మెగా డీఎస్సీ ఇస్తామని నిరుద్యోగ యువతకు ఆశలు కల్పించిందని, ఆ ప్రకటనలను నమ్మి వేలాది మంది యువత అప్పులు చేసి మరీ శిక్షణ తీసుకుని, ఏళ్ల తరబడి రాత్రింబవళ్లు చదివారని మంత్రి పేర్కొన్నారు. చివరకు నోటిఫికేషన్ ఇవ్వకుండా వారి ఆశలను అడియాసలు చేసి, భవిష్యత్తుతో చెలగాటమాడారని మండిపడ్డారు. నాటి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన బొత్స సత్యనారాయణ ఈ వైఫల్యానికి సమాధానం చెప్పాలి. అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సింది చేయకుండా, ఇప్పుడు పెద్దల సభలో నిలబడి డీఎస్సీపై ప్రశ్నలు సంధించడం రాజకీయ ద్వంద్వ వైఖరి కాదా? అని ప్రశ్నించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి, నిరుద్యోగ యువతకు సకాలంలో ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు చేపడితే దానిని కూడా అడ్డుకునేందుకు వైకాపా ప్రయత్నించిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. డీఎస్సీ ప్రక్రియను అడ్డుకునేందుకు ఏకంగా 300 కోర్టు కేసులు వేసిన దుర్మార్గపు వైఖరి వైకాపాదేనని మండిపడ్డారు. కోర్టుల చేత చీవాట్లు తిన్నా వైకాపా నేతలకు బుద్ధి రాలేదని, అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసి, తాము ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకొస్తే కోర్టు కేసులతో అడ్డుకునేందుకు ప్రయత్నించడం నిరుద్యోగ యువత పట్ల వైకాపాకు ఉన్న చిత్తశుద్ధిని బయటపెడుతోందన్నారు. బొత్స సత్యనారాయణ .. డీఎస్సీపై చర్చకు మేము వెనక్కి తగ్గేది లేదు. శాసనమండలిలో ఏ సమయానికైనా, ఎన్ని రోజులైనా చర్చించేందుకు సిద్ధం. మీరు, మీ పార్టీ సభ్యులు లేవనెత్తే ప్రతి అంశానికి ఆధారాలతో సహా సమాధానం చెబుతాం. అంతేకాదు, మీ ఐదేళ్ల పాలనలో డీఎస్సీ విషయంలో ఏం చేశారు? నిరుద్యోగులకు ఇచ్చిన హామీలేమిటి? వాటిని ఎలా విస్మరించారు? అనే సమగ్ర వివరాలతో కూడిన బుక్‌లెట్‌ను కూడా పంపిస్తాం. ముందు దాన్ని చదువుకుని సభకు రండి. ఆ తర్వాత ఎవరు నిరుద్యోగులను మోసం చేశారో, ఎవరు వారికి ఉద్యోగాలు కల్పించారో మండలి వేదికగానే తేల్చుకుందాం అని మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. ఐదేళ్ల పాటు రాత్రింబవళ్లు కష్టపడి చదివి, ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని, తమ ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల శ్రమను కించపరిచేలా వైకాపా నాయకులు మాట్లాడటం బాధాకరమని మంత్రి పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యోగాలు సాధించిన యువతను, వారి భవిష్యత్తును వివాదాల్లోకి లాగొద్దని హెచ్చరించారు. మీ ఐదేళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి అసత్య ప్రచారాలతో యువతను మరోసారి మోసం చేయాలని చూడొద్దు. నిరుద్యోగుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయడం మానుకోండి. డీఎస్సీ విషయంలో ఎవరి చిత్తశుద్ధి ఏమిటో, ఎవరి పాలనలో యువతకు ద్రోహం జరిగిందో ఆధారాలతో సహా సభలోనే తేల్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దమ్ముంటే చర్చకు రండి అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
