ఊట్కూర్‌లో ఘనంగా నాగుల పంచమి వేడుకలు..

ఊట్కూర్, ఆంధ్రప్రభ: శ్రావణమాసంలో మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే నాగుల పంచమి వేడుకలు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో సోమవారం ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే మహిళలు కొత్త వస్త్రాలు ధరించి సమీపంలోని నాగుల పుట్టలు, ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగదేవతలకు పసుపు, కుంకుమ, పాలు, పూలు సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. కొందరు మహిళలు ఉపవాస దీక్షలు చేపట్టి కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని నాగదేవతను ప్రార్థించారు.

పుట్టల వద్ద పూజలు నిర్వహించిన అనంతరం పసుపు, కుంకుమతో పాటు నైవేద్యాలు సమర్పించారు. గ్రామాల్లోని ఆలయాలు, నాగుల పుట్టల వద్ద ఉదయం నుంచే మహిళల సందడి కనిపించింది. చిన్నారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో పండుగ వాతావరణం నెలకొంది. పలు గ్రామాల్లో కుటుంబ సభ్యులతో కలిసి మహిళలు నాగదేవతకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఆయా గ్రామాల్లో ఏర్పాట్లు చేశారు.