బ్రహ్మంగారి దేవాలయ భూమి రికార్డులపై సమగ్ర విచారణకు డిమాండ్

భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : భీంగల్ మండలం భీంగల్ గ్రామంలోని నందిగల్లి బస్‌స్టాప్ వెనుక ఉన్న శ్రీ బ్రహ్మంగారి దేవాలయానికి సంబంధించిన భూమి రెవెన్యూ రికార్డులపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరుతూ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు.

సంఘం సభ్యుల వివరాల ప్రకారం.. సర్వే నంబర్ 675లోని 6.0800 ఎకరాల భూమి పాత రెవెన్యూ రికార్డుల్లో శ్రీ బ్రహ్మంగారి దేవాలయానికి సంబంధించిన భూమిగా నమోదై ఉందని తెలిపారు. 2011-17 కాలానికి సంబంధించిన మీ-సేవా ధ్రువీకృత పహాణీ, అడంగల్ పత్రాలతో పాటు 2012-13 నుంచి 2015-16 వరకు ఉన్న పాత రికార్డుల్లోనూ ఈ భూమి వివరాలు నమోదై ఉన్నాయని పేర్కొన్నారు.

అయితే 2017 సంవత్సరం నుంచి తదుపరి రెవెన్యూ రికార్డుల్లో ఈ భూమి వివరాలు కనిపించకపోవడంపై సంఘం సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. రికార్డుల్లో మార్పులు ఎందుకు జరిగాయి, ఎవరి ఆదేశాల మేరకు జరిగాయి, ఏ ఉత్తర్వులు లేదా ప్రక్రియల ఆధారంగా మార్పులు చేశారనే అంశాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని కోరారు. పాత పహాణీలు, అడంగల్, 1-బి, సెత్‌వార్ తదితర రికార్డులతో పాటు ప్రస్తుత డిజిటల్ రెవెన్యూ రికార్డులను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి వాస్తవాలను నిర్ధారించాలని కోరారు.

పాత రికార్డుల ఆధారంగా భూమి దేవాలయానికి సంబంధించినదిగా నిర్ధారణ అయితే చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా రికార్డులను పునరుద్ధరించి దేవాలయ భూమికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. రికార్డుల్లో అక్రమ మార్పులు లేదా తొలగింపులు జరిగినట్లు విచారణలో తేలితే బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు కోరారు. జిల్లా అధికారులు ఫిర్యాదుపై తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టి శ్రీ బ్రహ్మంగారి దేవాలయ భూమికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.