పల్లె ప్రకృతి వనంలో క్షుద్ర పూజల కలకలం
కామనపల్లిలో చేతబడి ఆనవాళ్లు..
భయాందోళనలో గ్రామస్తులు
జన్నారం, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కామనపల్లి గ్రామంలోని పల్లె ప్రకృతి వనంలో చేతబడి ఆనవాళ్లు కనిపించడంతో గ్రామంలో కలకలం రేగింది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.
పల్లె ప్రకృతి వనంలోని ఓ పెద్ద చెట్టుకు గుర్తుతెలియని వ్యక్తులు చిన్న బొమ్మలను ఏర్పాటు చేసి, జీడిగింజలను మేకులతో కొట్టి పూజలు చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయని గ్రామస్తులు తెలిపారు.
మూఢనమ్మకాలతో కూడిన ఈ ఘటన వెలుగులోకి రావడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో భయాందోళనలు సృష్టించేందుకే కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కావాలనే క్షుద్ర పూజలు చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ విషయమై గ్రామ సర్పంచి పేరం శ్రీనివాస్‌ను బుధవారం సాయంత్రం సంప్రదించగా, గ్రామంలో భయాందోళనలు కలిగించేందుకు కొందరు వ్యక్తులు పల్లె ప్రకృతి వనంలోని చెట్టు వద్ద క్షుద్ర పూజలు చేసినట్లు భావిస్తున్నామని తెలిపారు.
ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి అనుమానితులను గుర్తించేందుకు గ్రామస్తులు సహకరించాలని సర్పంచి కోరారు.
