Sensex | నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు…

చమురు ధరల సెగ..
ఐటీ, రియాల్టీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో అమ్మకాలు


Sensex | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న అనిశ్చితి కారణంగా ముడిచమురు ధరలు పెరగడం మార్కెట్‌ సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది. దీనికితోడు ఐటీ, రియాల్టీ, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సూచీలు రోజంతా నష్టాల్లోనే కదలాడాయి.

టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ రాజీనామా వార్త ప్రభావం టీసీఎస్‌ షేర్లపై తీవ్రంగా పడింది. దీంతో టీసీఎస్‌ షేర్లు 4 శాతానికి పైగా క్షీణించడం మార్కెట్‌పై అదనపు ఒత్తిడిని పెంచింది. సెన్సెక్స్‌ ఉదయం 78,263.33 వద్ద లాభాలతో ప్రారంభమైంది. అయితే ఆరంభంలోనే నష్టాల్లోకి జారుకున్న సూచీ.. రోజంతా ప్రతికూలంగానే కొనసాగింది. ఇంట్రాడేలో 77,497.93 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. చివరికి 187.90 పాయింట్లు కోల్పోయి 77,966.35 వద్ద ముగిసింది.

నిఫ్టీ కూడా 35.75 పాయింట్లు నష్టపోయి 24,435.95 వద్ద స్థిరపడింది. దీంతో వరుసగా రెండో రోజు దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 30లో టీసీఎస్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, ఎల్‌అండ్‌టీ, ఎటర్నల్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు ప్రధానంగా నష్టాలను చవిచూశాయి. మరోవైపు ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, పవర్‌ గ్రిడ్‌, రిలయన్స్‌, బీఈఎల్‌ షేర్లు లాభాల్లో కొనసాగాయి. కొన్ని కీలక షేర్లలో కొనుగోళ్లు కనిపించినప్పటికీ.. భారీ అమ్మకాల ఒత్తిడిని పూర్తిగా అధిగమించలేకపోయాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు అధిక స్థాయిలో కొనసాగుతున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 88.71 డాలర్ల వద్ద ఉంది. పశ్చిమాసియాలో పరిస్థితుల కారణంగా చమురు సరఫరాపై అనిశ్చితి కొనసాగితే ధరలు మరింత ప్రభావితమయ్యే అవకాశం ఉందన్న ఆందోళన మార్కెట్‌ వర్గాల్లో ఉంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ఔన్స్‌ ధర 4,417.97 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.33 వద్ద కొనసాగింది.