తిరువూరు దాహార్తికి తక్షణ ఊరట

  • శాశ్వత పరిష్కారానికి కృష్ణా జలాల ప్రాజెక్టు
  • మంచినీటి ట్యాంకర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
  • రూ.240 కోట్ల కృష్ణా తాగునీటి ప్రాజెక్టుతో దశాబ్దాల సమస్యకు ముగింపు
  • ప్రజా సమస్యలకు వెంటనే స్పందించడమే ప్రజాప్రతినిధుల బాధ్యత
  • సేవా కార్యక్రమాలకు సూరపనేని జయసింహ సేవాభావం అభినందనీయం
  • ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు

తిరువూరు, ఆంధ్రప్రభ: తిరువూరు పట్టణ ప్రజల తాగునీటి ఇబ్బందులకు తక్షణ ఉపశమనం కల్పించడంతో పాటు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు వేగవంతం చేస్తున్నామని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. సూరపనేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజల సేవార్థం ఏర్పాటు చేసిన మంచినీటి ట్యాంకర్‌ను శుక్రవారం తన కార్యాలయ ప్రాంగణంలో ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.

పట్టణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ సూరపనేని జయసింహా సహకారంతో ఏర్పాటు చేసిన మంచినీటి ట్యాంకర్‌ను ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వచ్ఛమైన తాగునీటిని నిరంతరం అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇటీవల ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంలో ప్రజలు ప్రధానంగా మంచినీటి సమస్యను తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తాత్కాలిక ఉపశమన చర్యగా ఈ మంచినీటి ట్యాంకర్‌ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. తిరువూరు పట్టణంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న మంచినీటి సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.240 కోట్ల కృష్ణా జలాల తాగునీటి ప్రాజెక్టు ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే వెల్లడించారు.

త్వరలోనే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభిస్తామని, ప్రాజెక్టు పూర్తయిన తర్వాత పట్టణ ప్రజలకు నిరంతరాయంగా స్వచ్ఛమైన కృష్ణా జలాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అప్పటి వరకు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన తాత్కాలిక చర్యలను ప్రభుత్వం కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు. “ప్రజల సమస్యలను తెలుసుకోవడం మాత్రమే కాదు… వాటికి వెంటనే పరిష్కారం చూపడమే ప్రజాప్రతినిధుల బాధ్యత” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సేవా దృక్పథంతో ముందుకొచ్చి మంచినీటి ట్యాంకర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన సూరపనేని చారిటబుల్ ట్రస్ట్, డాక్టర్ సూరపనేని జయసింహా సేవాభావాన్ని ఆయన ప్రశంసించారు.

సమాజానికి ఉపయోగపడే ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెందరికో ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. డాక్టర్ సూరపనేని జయసింహా మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవాలనే సంకల్పంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. భవిష్యత్తులో కూడా విద్య, వైద్యం, తాగునీరు, పేదల సంక్షేమం వంటి రంగాల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వెల్లడించారు.

అనంతరం డాక్టర్ సూరపనేని జయసింహాను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ మాజీ అధ్యక్షుడు బొమ్మసాని ఉమామహేష్, మాజీ ప్రధాన కార్యదర్శి సింధు శ్రీను, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ఆకుల దుర్గాప్రసాద్, ముత్యాల మధు, రాజవరపు శ్రీనివాసరావు, వాకదాని లక్ష్మీనారాయణ, దూదిపాళ్ల రంగారావు, యండ్రాతి రంజిత్, అబ్బాస్ చౌదరి, చంద్రమౌళి, షేక్ హని, భూమా సురేష్, కంభం రాజా, పంది శ్రీను, బోయపాటి ప్రకాష్, పగిడిపల్లి పుల్లారావుతో పాటు కూటమి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, పెద్ద సంఖ్యలో పట్టణ ప్రజలు పాల్గొన్నారు.