మధ్యవర్తిత్వంపై అవగాహన పెంచాలి
న్యాయమూర్తి వాసంతి
నర్సాపురం, ఆంధ్రప్రభ: కోర్టుల్లో పెండింగ్ కేసులు తగ్గించడానికి, ఇరువర్గాల వారికి రాజీ మార్గం ద్వారా తక్కువ ఖర్చుతో సత్వర న్యాయం అందించడానికి భారతీయ న్యాయ సేవాధికార సంస్థ చేపట్టిన కార్యక్రమమే “దేశం కోసం మధ్యవర్తిత్వం 3.0” అని నరసాపురం పదవ అదనపు జిల్లా న్యాయమూర్తి మరియు మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ ఎ వాసంతి తెలిపారు . శుక్రవారం సాయంత్రం ట్రెయిన్డ్ మీడియేటర్స్ , ప్యానెల్ లాయర్స్ తో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ మీడియేటర్స్ కి రిఫర్ చేసిన కేసుల్లో సహనంతో ఇరువర్గాల వారికి న్యాయం జరిగేలా ప్రయత్నిస్తే తక్కువ సమయంలో కేసుల నుండి ఉపశమనం పొందుతారని, కోర్టుల్లో పెండింగ్ భారం కూడా తగ్గుతుందన్నారు. మధ్యవర్తిత్వం వల్ల కలిగే ఉపయోగాలను కక్షిదారులకు అర్థమయ్యేలా వివరించినపుడే, వారికి నమ్మకం ఏర్పడుతుందని, ముఖ్యంగా ఆస్తి, కుటుంబ తగాదాల్లో శాశ్వత పరిష్కారం పొందడానికి మంచి మార్గదర్శకం అన్నారు. ప్యానెల్ లాయర్స్ కూడా గ్రామాల్లో మధ్యవర్తిత్వం పై అవగాహన పెంచేలా ప్రతీ ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రెయిన్డ్ మీడియార్లు, ప్యానెల్ లాయర్స్ పాల్గొన్నారు.
