Godavari Pushkaralu | రాజమహేంద్రవరం ఆలయాల అభివృద్ధికి భారీ నిధులు
Godavari Pushkaralu | రాజమహేంద్రవరం ఆలయాల అభివృద్ధికి భారీ నిధులు
Godavari Pushkaralu | గోదావరి పుష్కరాలకు ముందస్తు ప్రణాళికలు
పుష్కర ఘాట్లు, యాత్రికుల సౌకర్యాల విస్తరణ
ధవళేశ్వరం, కోటిలింగాల ఆలయాలకు కొత్త రూపు
10 కోట్ల మంది యాత్రికుల కోసం ప్రభుత్వ సన్నాహాలు
Godavari Pushkaralu | అమరావతి, ఆంధ్రప్రభ : వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని పలు చరిత్ర ప్రసిద్ధి చెందిన దేవాలయాలను ఆధునీకరించాలని దేవాదాయ తాజాగా నిర్ణయించినట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.
2026 జూన్ 26 నుండి జూలై 7 వరకు రంగారంగ వైభవంగా గోదావరి నది పుష్కరాలను నిర్వహించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున వివిధ శాఖలతో కలిసి ప్రణాళికలను రూపొందిస్తోంది. ఏడాది ముందు నుంచి దృష్టి సారిస్తే పుష్కరాల నాటికి అన్ని పనులు పూర్తవుతాయని ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ఉంది. తూర్పుగోదావరి ప్రాంతంలో గోదావరి నది పరిసరాలు ఎక్కువగా ఉండటంతో రాజమహేంద్రవరం ఏరియాలో ప్రముఖ ఆలయాలను అభివృద్ధి చేసేందుకు దేవాదాయ శాఖ దృష్టి పెట్టింది. ఈ జిల్లాలో అప్పటికే కొన్ని ముఖ్యమైన ఆలయాలను గుర్తించి వాటి పునరుద్ధరణ, మరమ్మతులపై దృష్టి సారించింది.
గోదావరి ఒడ్డున, రాజమహేంద్రవరంలో అతి ప్రాచీన శైవ క్షేత్రం కోటిలింగాల ఆలయం ఉంది. ఇక్కడ పుష్కర స్నానాలకు భక్తులు విశేషంగా తరలి వస్తారు. ప్రధాన ఘాట్‌ను కూడా నిర్మిస్తున్నారు. ఈ దేవాలయం మరమ్మతుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. పుష్కర మరమ్మతులు ఫేజ్-1 పనుల క్రింద రూ. 9.55 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో పనులు చేసే ప్రాంతాల్లో ఏప్రిల్ 12న మంత్రి ఆనం శంకుస్థాపన కూడా చేశారు. 6 ఆలయాల్లో కొత్త నిర్మాణాలు, రెనోవేషన్ పనులు, పందిరి మహాదేవుని సత్రం వద్ద మౌలిక వసతులు, ఘాట్ అభివృద్ధి చేస్తారు.
రాజమహేంద్రవరంలో శ్రీ రామ సత్యనారాయణ స్వామి ఆలయం సిద్ధిగాంచింది. ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తారు. రూ. 1 కోటి పుష్కర నిధులతో ముఖ మండపం పునర్నిర్మాణం, ఆలయ పరిసరాల సుందరీకరణ, భక్తుల సౌకర్యాలు కల్పించేలా పనులు సాగుతున్నాయి. ఈ సమీపంలో ఉన్న పీఎంకే సత్రం వద్ద పుష్కరాలకు వచ్చే యాత్రికులు తమ పూర్వీకులకు పిండ ప్రధానం చేసుకునేందుకు వీలుగా భారీ షెడ్‌ను నిర్మిస్తున్నారు. గోదావరిలో పిండ ప్రదానం చేస్తే పితృదేవతలు తరిస్తారనే నమ్మకం ఉంది. వీటి మరమ్మతుల కోసం పుష్కరాల క్రింద రూ. 3 కోట్లు నిధులు కేటాయించారు. రెండు అంతస్తుల్లో పిండ ప్రదాన హాల్ అభివృద్ధి చేస్తున్నారు.
నదికి సమీపంలో గౌతమీ జీవకారుణ్య సంఘం ఉంది. పుష్కరాలకు తరలి వచ్చే యాత్రికులకు ఇక్కడ అన్నదాన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీని మరమ్మతుల కోసం దేవాదాయ శాఖ రూ. 2.80 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఇక్కడ భవనం, వంటశాల పునర్నిర్మాణం జరుగుతోంది. శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి, ఆంజనేయ స్వామి ఆలయాలు, డోలేశ్వరం స్వామి ఆలయాల మరమ్మతులకు కూడా రూ. కోటి కేటాయించారు. పనులు సాగుతున్నాయి.
ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర, గోదావరి 7 పాయలుగా చీలే ప్రదేశం. గౌతమి, వశిష్ఠ, వైనతేయ నదులు ఇక్కడి నుండే విడిపోతాయి. ఇక్కడ ఉన్న దేవాలయాలకు ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉంది. దక్షిణ భారతదేశంలో ఉజ్జయిని తరహాలో మహాకాళేశ్వరం ఆలయం రాజమహేంద్రవరం వద్ద ఉంది. 109 అడుగుల గర్భాలయం, 64 ఉపాలయాలు. ఇక్కడ భస్మాభిషేకం నిర్వహిస్తారు. చితాభస్మంతో అభిషేకం చేస్తారు. మహిళలకు కూడా అనుమతి ఉంది.
తూర్పుగోదావరి జిల్లాలో వీటితోపాటు ఇతర ముఖ్యమైన 18 ఆలయాలకు రూ. 29.65 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుతం పనులు సాగుతున్నాయి. గోదావరి పుష్కరాల దృష్టిలో పెట్టుకొని రూ. 51.79 కోట్లతో 43 ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో మొత్తం 525 పుష్కర ఘాట్లు ఏర్పాటు చేస్తున్నారు. 6 జిల్లాల్లో ఇప్పుడున్న 288 ఘాట్లకు అదనంగా 237 కొత్త ఘాట్లు నిర్మాణం జరుగుతోంది.
అఖండ గోదావరి ప్రాజెక్ట్ పథకం క్రింద రూ. 97 కోట్లతో హెవ్క్ బ్రిడ్జి, పుష్కర ఘాట్ ఆధునీకరణను చేపడుతున్నారు. గోదావరి పుష్కరాలకు రాజమహేంద్రవరం ప్రధాన కేంద్రంగా ఉంది. 1884 నుంచే ఉత్కళ, నిజాం రాష్ట్రాల నుండి భక్తులు విశేషంగా తరలివచ్చేవారు. 2015లో 4.86 కోట్ల మంది రాగా 2026లో 10 కోట్ల మంది యాత్రికులు గోదావరి పుష్కరాలకు వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది.
