రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు: పట్టాభిరాం

  • ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం
  • మంత్రి లోకేష్ విసిరిన సవాల్‌ను జగన్ స్వీకరించాలి
  • ‘జెన్ జీ’ ఉద్యమం పేరుతో వైసీపీ వీథి నాటకాలు ఆడుతోంది
  • ప్రజాస్వామ్యాన్ని అడ్డుపెట్టుకుని అశాంతి సృష్టించే ప్రయత్నాలు సరికావు
  • స్వచ్ఛందర కార్పొరేషన్ చైర్మన్ కామారెడ్డి పట్టాభిరాం

విజయవాడ, ఆంధ్రప్రభ: డీఎస్సీ అంశాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని టీటీడీ అధికార ప్రతినిధి, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ, ‘జెన్ జీ’ ఉద్యమం పేరుతో వైసీపీ వీథి నాటకాలు ఆడుతోందని, దాని వెనుక అసాంఘిక శక్తులు, గంజాయి ముఠాలు, రౌడీ మూకలు ఉన్నాయని విమర్శించారు. డీఎస్సీ అభ్యర్థుల సమస్యను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుని రాష్ట్రంలో అశాంతి నెలకొల్పే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

విజయవాడలో రద్దీ ప్రాంతంలో పోలీసుల అనుమతి లేకుండా నిర్వహించిన నిరసనల వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నారు. ప్రజల ఫిర్యాదుల మేరకు స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమ స్పందించడం తప్పేమీ కాదని పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ డీఎస్సీ అంశంపై విసిరిన సవాల్‌ను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వీకరించాలని పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. కూటమి పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రతిపక్షాలు ఆలోచించాలని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులు, విగ్రహాల ధ్వంస ఘటనలపై అప్పటి వైసీపీ నాయకులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాసరావులపై కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, రాజకీయాల్లో సంయమనం పాటించాలని హెచ్చరించారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలనైనా కూటమి ప్రభుత్వం చట్టబద్ధంగా ఎదుర్కొంటుందని, ప్రజలు కూడా ఇటువంటి రాజకీయాలను తిరస్కరిస్తారని పట్టాభిరామ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏపీ భవన నిర్మాణ కార్మికుల సలహా మండలి చైర్మన్ జి. రఘురామరాజు, టీడీపీ నాయకులు కాకు మల్లికార్జున యాదవ్, దాసరి ఉదయ కరుణశ్రీ, చరణ్ శాయి తదితరులు పాల్గొన్నారు.