ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం
- ‘ఒక నెల–ఒక గ్రామం–నాలుగు సందర్శనలు’ కార్యక్రమం
- వచ్చిన ప్రతి అర్జీని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి
- అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలి
- పెనుగంచిప్రోలు ప్రత్యేక గ్రీవెన్స్‌లో 160 అర్జీల స్వీకరణ
- కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ
పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ: ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీకి కేవలం తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదేశించారు. ప్రజల సమస్యలను అత్యంత ప్రాధాన్యంగా పరిగణించి నిర్ణీత గడువులోగా పరిష్కరించడం ద్వారా ప్రజలకు వేగవంతమైన, సమర్థవంతమైన పరిపాలన అందించాలని సూచించారు. ‘ఒక నెల–ఒక గ్రామం–నాలుగు సందర్శనలు’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పెనుగంచిప్రోలులోని ఆర్‌కే ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్ (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియాతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి నెల ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసి నాలుగు విడతల్లో ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పెనుగంచిప్రోలులో తొలి విడత కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. ఈ ప్రత్యేక గ్రీవెన్స్‌లో మొత్తం 160 అర్జీలు అందాయని, వాటిలో అధిక భాగం రెవెన్యూ భూ వివాదాలు, పంచాయతీరాజ్ సమస్యలు, ప్రభుత్వ సేవలకు సంబంధించిన వినతులేనని వెల్లడించారు.
ప్రతి అర్జీపై సంబంధిత శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి విచారణ నిర్వహించి, వాస్తవ పరిస్థితులను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా నిర్ణీత గడువులో తప్పనిసరిగా పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో ఆలస్యం లేకుండా శాఖల మధ్య సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు కార్యాలయాలకు పరిమితం కాకుండా గ్రామాలకు వెళ్లి బాధితులతో నేరుగా మాట్లాడి వాస్తవాలను తెలుసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.
సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు భవిష్యత్తులో అదే సమస్య పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు, రెవెన్యూ, భూ సమస్యలు, పంచాయతీరాజ్ తదితర అంశాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వేగంగా పరిష్కరించడమే ‘ఒక నెల–ఒక గ్రామం–నాలుగు సందర్శనలు’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నందిగామ ఆర్డీవో గడ్డిపాటి అనిల్ కుమార్, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి జి. జ్యోతి, తహసీల్దార్ బి. కళ్యాణితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
