జియోగ్రఫీ బీ పోటీల్లో తెలుగు బాలుడి ప్రతిభ

అంతర్జాతీయ పోటీల్లో 12 పతకాలు.. ప్రపంచ స్థాయిలో ద్వితీయ స్థానం

ఘంటసాల, ఆంధ్రప్రభ: కృష్ణా జిల్లా ఘంటసాల గ్రామానికి చెందిన 8 ఏళ్ల జై వేమూరి అంతర్జాతీయ భూగోళశాస్త్ర (జియోగ్రఫీ బీ) పోటీల్లో అసాధారణ ప్రతిభ కనబరిచి తెలుగు వారి కీర్తిని ప్రపంచ వేదికపై చాటాడు. అమెరికాలో జన్మించి పెరిగిన జై చిన్నప్పటి నుంచే చదువుతో పాటు వివిధ విద్యా పోటీల్లో ప్రతిభ కనబరుస్తూ వస్తున్నాడు. ఇటీవల థాయిలాండ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ జియోగ్రఫీ బీ పోటీల్లో 12 పతకాలు సాధించాడు. ఇందులో 2 బంగారు, 3 వెండి, 7 కాంస్య పతకాలు ఉన్నాయి.

ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ జియోగ్రఫీ బీ పోటీలో ప్రపంచ స్థాయిలో ద్వితీయ స్థానం సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. జై తల్లిదండ్రులు డాక్టర్ ప్రవీణ్ వేమూరి, డాక్టర్ దీప్తి వేమూరి అమెరికాలో వైద్యులుగా సేవలందిస్తున్నారు. విదేశాల్లో పెరిగినప్పటికీ విద్యా రంగంలో ఉన్నత స్థాయిలో రాణిస్తున్న జైపై ఘంటసాల గ్రామస్థులు, బంధువులు, స్నేహితులు అభినందనలు తెలిపారు.