Free Sand Policy Andhra Pradesh | ఉచిత ఇసుక పాలసీకి పోలవరంలో బ్రేక్

Free Sand Policy Andhra Pradesh | ఉచిత ఇసుక పాలసీకి పోలవరంలో బ్రేక్

Free Sand Policy Andhra Pradesh | స్టేషనరీ సమస్యతో నిలిచిపోయిన గుండాల ఉచిత ఇసుక ర్యాంప్
ఏకైక ర్యాంప్ మూతతో నిర్మాణ పనులు, కార్మికులకు తీవ్ర ఇబ్బందులు
ఉచిత ఇసుక పాలసీ లక్ష్యాలకు తూట్లు పొడుస్తున్న పరిస్థితులు
కలెక్టర్ జోక్యంతో సమస్య పరిష్కారమవుతుందనే ప్రజల ఆశ

Free Sand Policy Andhra Pradesh | పోలవరం (రంపచోడవరం) జిల్లా, ఆంధ్రప్రభ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుకపై కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత ఇసుక పథకంలో మరికొన్ని మార్పులు చేసి ఉచిత ర్యాంపుల నుంచి నామమాత్రపు రుసుముతో ఇసుక అందించాలనే దృఢసంకల్పంతో ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఇసుక పాలసీతో ప్రజలకు ఇసుక కొరత ఉండకూడదనేది, ఇసుక అందుబాటులో లేదన్న కారణంతో ఇళ్ల నిర్మాణాలు ఆగిపోకూడదని, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులకు ఇసుక కొరత లేకుండా చూడాలనేదే ప్రభుత్వ ధ్యేయం. ఇది బొమ్మకు ఒక వైపు. ఉమ్మడి అల్లూరి సీతారామరాజు, ప్రస్తుతం పోలవరం జిల్లాలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఏజెన్సీలో ఉచిత ఇసుక ఉత్తమాటేనని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

స్టేషనరీ మార్పు పేరుతో నిలిచిన ర్యాంప్

ప్రభుత్వం ప్రజలకు ఉచిత ఇసుకను పారదర్శకంగా అందజేయాలన్న ఆలోచనతో మరో అడుగు ముందుకు వేసింది. ఈ నేపథ్యంలోనే మే 1వ తేదీ నుంచి నూతన స్టేషనరీ విధానాన్ని అమలు చేసింది. అవకతవకలు, ఫేక్ బిల్లులు, అక్రమాలు చోటు చేసుకోకుండా ప్రభుత్వ ప్రతిబింబం (హోలోగ్రామ్)తో స్టేషనరీ ముద్రించి నిర్వాహకులకు ఇచ్చేందుకు సిద్ధమై అన్ని జిల్లాలకు స్టేషనరీ సరఫరా చేసింది. ఈ క్రమంలో ఏఎస్ఆర్, ప్రస్తుత పోలవరం జిల్లాలోని గుండాల ఇసుక ర్యాంప్ నిర్వాహకులకు అందించాల్సిన స్టేషనరీ అందించకుండా ఏఎస్ఆర్ జిల్లా మైన్స్ ఏడీ అడ్డుపడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ స్టేషనరీ రాకపోవడంతో గుండాల ఉచిత ఇసుక ర్యాంప్ నిలిచినట్లు తెలుస్తోంది.

మూతపడ్డ ఏకైక ఇసుక ర్యాంప్

ప్రభుత్వం ఉచిత ఇసుక ర్యాంపులు ఏర్పాటు చేసి ర్యాంపుల నిర్వహణ బాధ్యత కొంతమంది నిర్వాహకులకు అప్పగించింది. అలా అప్పగించిన వాటిలో ప్రస్తుత పోలవరం జిల్లాలోని ఎటపాక మండలం గుండాల ఇసుక ర్యాంప్ ఉంది. ఈ ర్యాంప్ గత ఏడాదిన్నరగా నడిచి, ప్రస్తుతం గత నెలన్నరగా మూతపడింది. ఈ ర్యాంప్ ఉమ్మడి ఏఎస్ఆర్ జిల్లాలో ఒక్కటే ఉండటం కూడా విశేషం. ఉన్న ఒక్కగానొక్క ఇసుక ర్యాంప్ అధికారి అడ్డంకులు, చేష్టలతో మూతపడిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ఉచిత ఇసుక పాలసీకి తూట్లు

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక పాలసీ ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో ప్రారంభమైనప్పటికీ, పోలవరం జిల్లాలో ఉన్న ఏకైక ఇసుక ర్యాంపు మూసివేయడం వల్ల ఆ లక్ష్యం నీరుగారుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ర్యాంపు మూసివేయడంతో గృహ నిర్మాణదారులు, చిన్న కాంట్రాక్టర్లు, కార్మికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇసుక అందుబాటులో లేకపోవడంతో నిర్మాణ పనులు నిలిచిపోయి, రోజువారీ కూలీలకు ఉపాధి దెబ్బతింటోంది. ఉచితంగా ఇసుక లభించినా, ర్యాంపుల వద్ద సరఫరా నిలిచిపోవడంతో ప్రైవేట్ వాహనాల ద్వారా అధిక ధరలకు ఇసుక కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కలెక్టర్ దృష్టిసారిస్తే సమస్య పరిష్కారం

ఒక అధికారి సృష్టించిన అడ్డంకులతో నిలిచిన ఉచిత ఇసుక ర్యాంప్‌పై జిల్లా కలెక్టర్ దృష్టిసారించాలి. ర్యాంప్ నిలిచి రెండు నెలలు కావొస్తున్నా, ర్యాంప్ ప్రారంభించకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మూసివేసిన ర్యాంపును తిరిగి ప్రారంభించాలని, ఇసుక సరఫరాను పారదర్శకంగా, నిరంతరాయంగా నిర్వహించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేకపోతే ఉచిత ఇసుక పాలసీ కేవలం పేరుకే పరిమితమవుతుందని అభిప్రాయపడుతున్నారు.